
సమ్మెలో సమైక్యంగా పాల్గొనాలి
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు కోరారు. తద్వారా మనువాద, కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న కేంద్రంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో కేవీపీఎస్ ఆధ్వర్యాన బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులకు కూడా రక్షణ కరువైందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను బీజేపీ సర్కార్ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని, తద్వారా సంఘం ఏర్పాటు, సమ్మె చేయడం, కనీస వేతనం పొందే హక్కులు దూరమవుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన సమ్మెలో అందరూ భాగస్వాములై నిరసన తెలపాలని కోరారు. ఈసదస్సుకు నందిపాటి మనోహర్ అధ్యక్షత వహించగా, డాక్టర్ బీ.వీ.రాఘవులు, కోరిపల్లి శ్రీనివాస్, తుమ్మ విష్ణు, మెరుగు సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాసరావు, టి.లింగయ్య, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.