
వచ్చే వారం నుంచి ‘గర్ల్ ప్రైడ్’
● ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వచ్చేవారం నుంచి ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు శిశువు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్ బాక్స్, జిల్లా యంత్రాంగం తరపున సందేశం ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం జిల్లా సంక్షేమ అధికారి షెడ్యూల్ రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అమ్మాయి పుట్టడమంటే అదృష్టమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, కలెక్టరేట్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చేలా ప్లాస్టిక్ కాకుండా స్టీల్ వస్తువులే వాడాలని సూచించారు. రెండు వారాల్లోగా ఇది పూర్తిస్థాయిలో అమలుకావాలన్నారు. కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ అమలుచేయాలని చెప్పారు. అనంతరం జిల్లాలో ఎనిమిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్‌శ్రేష్టను సన్మానించారు.
దివ్యాంగులకు వసతుల కల్పన
ఖమ్మంవైద్యవిభాగం: సదరం క్యాంప్‌నకు వచ్చే దివ్యాంగులకు అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిని పరిశీలించిన ఆయన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీపై అవగాహన కల్పించాలని, దివ్యాంగులు పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చినప్పుడు రిసెప్షన్ సెంటర్, కుర్చీలు, నీడ, తాగునీరు సమకూర్చి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని తెలిపారు. ఈసమావేశాల్లో డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్ రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, వివిధ విభాగాల అధికారులు ఉమామహేశ్వరరావు, డాక్టర్ కిరణ్ కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
యువత నైపుణ్యాల పెంపునకు స్కిల్ హబ్
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని యువత నైపుణ్యతను పెంచేందుకు స్కిల్ హబ్ ఉపయోగపడుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలి పారు. ఖమ్మం రేవతి సెంటర్ సమీపాన కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ శిక్షణ ఇవ్వడం, విద్యార్థులు, యువత మార్గనిర్దేశం చేసేలా కమిటీని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎస్సెస్సీ, ఇంటర్ తర్వాత పిల్లలకు ఆంగ్లంపై శిక్షణ, కోడింగ్‌లో బేసిక్స్ నేర్చేందుకు యాప్‌లను రూపొందించామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగయులు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉచితంగా శిక్షణ అందుతుందని తెలిపారు.