శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లాలోని వివిధ పార్టీల నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. కాంగ్రెస్ నాయకులు బడ్జెట్‌లో కేటాయింపులపై హర్షం చేశారు. ఇదే సమయాన బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్ లైన్ నాయకులు మాత్రం విద్య, వైద్య, సాగునీటి రంగాలకు సరైన కేటాయింపులు లేవని పెదవి విరిచారు. ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీ కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. కాగా, వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొనగా, పెన్షనర్లు, ఉద్యోగులను నిరాశపరిచేలా బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరిశ పుల్లయ్య, రాయల రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. – సాక్షి నెట్‌వర్క్
వివిధ పార్టీల నాయకుల భిన్నాభిప్రాయాలు
అందరినీ మోసం చేశారు..
ఏ వర్గానికి ఈ బడ్జెట్ మేలు చేయదు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలకు మంగళం పాడారు. ఆటోడ్రైవర్ మొదలు అన్నదాతల వరకు సరైన కేటాయింపులు చేయకుండా అందరినీ రాష్ట్రప్రభుత్వం మోసం చేసింది. – తాతా మధుసూదన్,
ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు