
‘సాక్షి’ కార్యాలయంలో నిధి ఆప్‌కే నికట్
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ ఆధ్వర్యాన ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ‘నిధి ఆప్‌కే నికట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌పై ఉద్యోగుల సందేహాలను అధికారులు నివృత్తి చేయడమే కాక ప్రయోజనాలను వివరించారు. జిల్లా నోడల్ ఆఫీసర్ బి.నాగులు, సూపర్‌వైజర్ కె.నాగేశ్వరరావు, ఈఎస్‌ఐ బ్రాంచ్ ఇన్‌చార్జ్ మేనేజర్ రెహానా సుల్తానా, ఉద్యోగి బి.కార్తీక్‌తో పాటు సాక్షి బ్రాంచ్ మేనేజర్ జి.మోహనకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
సత్తుపల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సత్తుపల్లి సరస్వతి ఆలయం ఎదురుగా డబుల్ బెడ్‌రూం కాలనీలో నివాసముంటున్న పాశం కల్యాణ్(28) ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన సోమవారం రాత్రి సత్తుపల్లి నుంచి గంగారం వైపు బైక్‌పై వెళ్తుండగా బేతుపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ఐషర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కల్యాణ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
చికిత్స పొందుతున్న యువకుడు..
ఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సింగరేణి మండలం చందర్లగూడెంకు చెందిన అజ్మీరా సునీల్‌కుమార్(28) ఈనెల 23న సూర్యాపేట వైపు నుండి ఖమ్మం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా పొన్నేకల్ మసీదు మూలమలుపు వద్ద రోడ్డు పక్కన రాళ్లను ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడని సీఐ ముష్క రాజు తెలిపారు.
మనోవేదనతో వృద్ధుడి ఆత్మహత్య
రఘునాథపాలెం: కుమారుడు ఇంటికి రావడం లేదనే మనోవేదనతో ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించిన వివరాలు.. రఘునాథపాలెంకు చెందిన సుగ్గల రాఘవయ్య(70) వ్యాపారం చేయగా, అనారోగ్యంతో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఆయన చిన్నకుమారుడు శంకర్‌కు వివాహం కాకపోగా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన తిరిగి రాలేదు. దీంతో మనోవేదనకు లోనైన రాఘవయ్య ఈనెల 25న నివాసంలో ఉరి వేసుకోగా, కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
రెండు షాపుల్లో చోరీ
మధిర: మండలంలోని నిధానపురంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని రోడ్డు పక్కన షేక్ నాగుల్ మీరాకు చెందిన జానీ చికెన్ సెంటర్ లో చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.10 వేల నగద ఎత్తుకెళ్లారు. అలాగే, పక్కనే ఉన్న బెల్ట్‌షాపులో 15మద్యం సీసాలు సైతం చోరీ చేశారు. ఘటనపై బాధితులు మంగళవారం మధిర రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అత్యాచారయత్నం కేసు నమోదు
చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒంటరి మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఆమె మంగళవారం మామిడి కాయలు కోయడానికి కూలీకి వెళ్లగా, సదరు వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఈ సమయాన బాధితురాలు కేకలు వేయడంతో ఆయన పరారయ్యాడు. సదరు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
ఖమ్మంక్రైం: చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖమ్మంకు చెందిన రౌడీషీటర్ పేరల్లి ప్రవీణ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. భూకబ్జాలు చేయడమే కాక పలువురి నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న నేపథ్యాన పీడీ యాక్ట్ అమలుచేస్తూ చంచల్‌గూడలోని జైలుకు తరలించామని వెల్లడించారు. గతంలో ప్రవీణ్‌పై జిల్లాలో 30 కేసులు ఉండగా, బెయిల్‌పై బయటకు వచ్చినా తీరు మార్చుకోలేదని తెలిపారు.