
ఏసీబీ దాడులతో భయం.. భయం
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా గప్‌చుప్ ● కార్యాలయం ముఖమే చూడని డాక్యుమెంట్ రైటర్లు
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. కొందరు అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటుండగా.. ఇంకొందరు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన ఓ బాధితుడు చేసిన ఫిర్యాదుతో సోమవారం తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ రైటర్ పి.వెంకటేష్ ద్వారా రూ.30వేల లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ జె.అరుణను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ ఘటనతో మంగళవారం కార్యాలయమంతా బోసిపోయి కనిపించింది. ఉద్యోగులు భయంభయంగానే విధులు నిర్వర్తించగా సాధారణ రోజుల్లో పోలిస్తే తక్కువగనాఏ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ అరుణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఇన్‌చార్జ్ బాధ్యలు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భూపాల్‌కు అప్పగించారు.
తెరుచుకోని దుకాణాలు
రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు నేరుగా వెళ్తే ఏ పని జరగదనే అపవాదు ఉంది. ఇదే సమయాన డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించి వారి చెప్పిన నగదు ముట్టచెబితే పనులు చకచకా సాగుతాయని చెబుతున్నారు. తాజాగా ఏసీబీకి పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ సైతం డాక్యుమెంట్ రైటర్ సాయంతోనే లంచం తీసుకుంటూ పట్టుబడింది. దీంతో మంగళవారం కార్యాలయం పై అంతస్తుతో పాటు చుట్టుపక్కల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను తెరవలేదు. అంతేకాక ఎవరు కూడా కార్యాలయంలోకి అడుగు పెట్టే సాహసం చేయలేదు. దూరదూరంగా తిరుగుతూ కార్యాలయంలో ఎవరైనా తనిఖీలకు వచ్చారా అంటూ ఆరా తీయడం కనిపించింది. ఇక కార్యాలయ ఉద్యోగులు సైతం నేరుగా వచ్చిన వారికే రిజిస్ట్రేషన్లు చకచకా పూర్తిచేయడంతో ప్రతిరోజు ఇలాగే చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ భూపాల్‌ను వివరణ కోరగా మొత్తం 14మందికి నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇక సబ్ రిజిస్ట్రార్ జె.అరుణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పలు విషయాలపై విచారణ చేసినట్లు తెలిసింది. అంతేకాక లావాదేవీలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.