
జిల్లాలో దంచికొట్టిన వాన
ఖమ్మంవ్యవసాయం: నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 7గంటల నుంచి వర్షం కురిసింది. పగలంతా ఆకాశం మేఘావృతమై ఉండగా, సాయంత్రం దాటాక ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. రాత్రి 8 గంటల సమయానికి వాతావరణ శాఖ వెల్ల డించిన నివేదిక ఆధారంగా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో అత్యధికంగా 62.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, పెద్దగోపతిలో 57, తిరుమలాయపాలెంలో 37.8, రఘునాథపాలెంలో 36.5, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 36, చింతకానిలో 22.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద, సదాశివునిపాలెంలో 15.8, గంగారంలో 14.3 మి.మీ. వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అంతేకాక మిగతా ప్రాంతాల్లోనూ రాత్రి పొద్దుపోయే వర్షం కురిసింది. ఈ వర్షం రైతులు దుక్కులు సిద్దం చేసుకోవడానికి దోహదపడనుంది. కాగా, వర్షంతో ఖమ్మంలోని గాంధీచౌక్, కమాన్‌బజార్, పాత బస్టాండ్, వైరా రోడ్డు, కస్బాబజార్ తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు నిండి రహదారులపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
నైరుతి రుతుపవనాల ప్రభావం