
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కన్నుమూత
● ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రస్థానం ● తొలినాళ్లలో సర్పంచ్, ఎంపీటీసీగా కూడా విజయం ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం
వైరా/రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్(63) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఈనెల 23న చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి కాగా భార్య మంజుల, కుమారుడు మృగేందర్‌లాల్, కూతురు మనీషాలక్ష్మి ఉన్నారు. కుమారుడు తమిళనాడు(కోయంబత్తూరు) జీఎస్‌టీ కమిషనర్‌గా, కోడలు శ్వేత తమిళనాడు కేడర్‌లో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయన సోదరుడు, ఏసీపీ జవహర్‌లాల్ ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు మదన్‌లాల్ మృతితో విషాదం నెలకొంది.
ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యే దాకా..
మదన్‌లాల్ ఈర్లపూడిలోని సామాన్య కుటుంబంలో జన్మించారు. 11 మంది సంతానంలో మదన్‌లాల్ మూడో వ్యక్తి కాగా, ప్రాథమిక విద్య డోర్నకల్ మండలం బలపాలలో, డిగ్రీ ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో పూర్తిచేశారు. కళాశాల రోజుల్లో పీడీఎస్‌యూలో పనిచేసిన ఆయన.. 1989లో కామేపల్లి మండలం అబ్బాస్‌పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కబడ్డీలో ప్రావీణ్యం ఉండడంతో అదే ఏడాది ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై నా కేసుల కారణంగా ఉద్యోగం దక్కలేదు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీ నామా చేసి 1996 – 2001 వరకు ఈర్లపూడి సర్పంచ్‌గా పనిచేశారు. 2001 – 2006 వరకు ఆయన భార్య మంజుల సర్పంచ్‌గా కొనసాగగా, తిరిగి 2006లో మదన్‌లాల్ రెండోసారి సర్పంచ్‌గా, ఆపై కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా విజయం సాధించారు. 2004లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కలేదు. 2009లో ఏర్పాటైన వైరా(ఎస్టీ) నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఫలితం లేక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి 5వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దివంగత సీఎం వైఎస్‌పై అభిమానంతో 2014లో నాటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా వైఎస్సార్‌సీపీలో చేరి, వైరా నుంచి సీపీఎం మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఏడాది తిరగకుండానే బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) లో చేరగా, 2018, 2023 ఎన్నికల్లోనూ పోటీ చేసినా విజయం దక్కలేదు.
పరామర్శించిన కేసీఆర్.. పలువురి నివాళి
మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతదేహాన్ని ఖమ్మం కవిరాజ్‌నగర్‌లోని నివాసగృహానికి తీసుకొచ్చారు. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్ మదన్‌లాల్ కుమారుడు మృగేందర్‌లాల్‌కు ఫోన్ చేసి ఓదార్చారు. అలాగే, సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఇక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చానాగేశ్వరరావు, కొండబాలతదితరులు మదన్‌లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షు డు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు గడిపల్లి కవిత, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రాంపూడి రోశయ్య, పగడాల మంజు ల, కూరాకుల నాగభూషణం, కమలరాజు, గుండాల కృష్ణ, నెల్లూరి కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, నాగరాజు, సుబ్బారావు, నున్నా రవికుమార్, బాగం హేవంతురావు, దండి సురేష్, యర్రా బాబు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలి పారు. కాగా, మదన్‌లాల్ అంత్యక్రియలను బుధవారం స్వగ్రామమైన ఈర్లపుడిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కన్నుమూత