
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది (ఫైల్)
● జాగ్రత్తలు పాటిస్తే అగ్నిప్రమాదాలు దూరం ● వేసవిలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ
నేటి నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు
● మాక్‌డ్రిల్‌తో అవగాహన
ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాథమిక దశలోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. ఎండల ప్రభావం కారణంగా ఇళ్లు, గడ్డివాములు, అడవులు, దుకాణ సముదాయాలు, మిల్లుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో ఆస్తినష్టమే కాక ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. ఏటా ఎక్కడో ఓచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలు వీధిన పడతాయి. అయితే, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడమే కాక... అగ్నిమాపక శాఖకు సమాచారం ఇస్తే ప్రమాద తీవ్ర అవకాశముంటుంది. ఈనేపథ్యాన నేడు ప్రారంభమయ్యే వారోత్సవాల్లో భాగంగా భారీ అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించి ఆస్తులు, ప్రాణాలను కాపాడేందుకు మాక్‌డ్రిల్‌తో అగ్నిమాపక శాఖ అప్రమత్తం చేయనుంది. ఇదేసమయాన అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయనున్నారు.
● అందుబాటులో ‘బుల్లెట్’
నానాటికీ పెరుగుతున్న నిర్మాణాలకు తోడు పలువురు నిబంధనలు అతిక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఆయా గల్లీల్లోకి ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఎక్కడైనా వెళ్లగలిగేలా బుల్లెట్ ఫైర్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రెండు సిలిండర్లలో 20 లీటర్ల నీరు ఉంటుంది. ఫోమ్ వాటర్(నురగ) తుంపర్లుగా నీరు పిచికారి చేస్తూ వంద మీటర్లు వెడల్పులో వ్యాపించిన మంటలను సైతం సులువుగా ఆర్పేలా సిబ్బంది వీటిని ఉపయోగిస్తున్నారు.
● ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
– వంటగదిలో డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచొద్దు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయాన ఇళ్లలో విద్యుత్‌లైట్లు, మెయిన్ వద్ద సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి. ఇంటికి అన్నివైపులా గాలి, వెలుతూరు వచ్చేలా చూసుకోవాలి. దేవుడి మందిరం వద్ద వెలిగించిన దీపాలను అలాగే వదిలేసి బయటకు వెళ్లొద్దు. వంటపని పూర్తికాగానే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. చిన్నపిల్లలకు అగ్నిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వొద్దు. ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే ఆర్పడానికి ఎల్లప్పుడు నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.
● మంటల్లో చిక్కితే....
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కితే కంగారుపడకుండా దగ్గరలో ఉన్న అత్యవసర ద్వారాలను గుర్తించాలి. మంటలను ఆర్పే ఉపకరణాలు కన్పిస్తే వాటి సాయంతో బయటపడేందుకు ప్రయత్నించాలి. పొగ ముసురుకుంటే ముఖానికి తడివస్త్రం అడ్డు పెట్టుకుని బయటకురావాలి. నూనె ఉత్పత్తులు ఉన్న వైపు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లడం లేదా దుప్పటి చుట్టుకుంటే ఫలితం ఉంటుంది.
గల్లీల్లోకి సులువుగా వెళ్లే ఫైర్ బుల్లెట్
మిగతా సమయంతో పోలిస్తే అగ్నిప్రమాదాలు వేసవికాలంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈనేపథ్యాన ప్రజలు ఇళ్లల్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ మొదలు విద్యుత్ వినియోగం వరకు ప్రతీ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అగ్ని ప్రమాదం జరిగితే వడగాలులకు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి భారీనష్టం జరిగే అవకాశముంది. ఊరేగింపులు, వివిధ కార్యక్రమా ల సందర్భంగా కాల్చే టపాసులు గడ్డి వాములు, ఇళ్లపై పడి అగ్ని ప్రమాదాలు, ప్రాణహానీ జరుగుతుంది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించే అవకాశముంటుంది. ఇందుకోసం అగ్నిమాపక శాఖ ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రమాదాల బారిప పడకుండానే కాక ప్రమాదాలు జరిగినప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై ప్రజలను అప్రమత్తం చేయనుంది. – సత్తుపల్లిటౌన్
అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు
అగ్నిమాపక కేంద్రం ఫోన్ నంబర్
ఖమ్మం 87126 99280
సత్తుపల్లి 87126 99282
ఇల్లెందు 87126 99294
కొత్తగూడెం 87126 99296
భద్రాచలం 87126 99292
మధిర 87126 99284
అశ్వారావుపేట 87126 99298
వైరా 87126 99288
కూసుమంచి 87126 99286
మణుగూరు 87126 99300
నేలకొండపల్లి 87126 99290
అవగాహన అవసరం..
వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాల జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే తీవ్రత పెరుగుతుంది. వంట సమయాన మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఇంటి పరిసరాల్లో చెత్త, వృధా వస్తువులు పేరుకుపోకుండా చూడాలి. అగ్నిప్రమాదం జరిగితే నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోవాలి.
– ఐ.చంద్రశేఖర్‌రెడ్డి, ఫైర్ ఆఫీసర్, సత్తుపల్లి

