
● క్రీడాకారులకు అందని క్రీడా కిట్లు ● గ్రామపంచాయతీలకే పరిమితం ● ఉమ్మడి జిల్లాకు 1,336 కిట్ల కేటాయింపు ● ఇప్పుడైనా వినియోగంలోకి తీసుకురావాలంటున్న యువత
చుంచుపల్లి: క్రీడలపై ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించేలా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించినా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. సరైన వసతులు కల్పించకపోవడంతో చాలా చోట్ల క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన క్రీడా సామగ్రి గ్రామపంచాయతీ కార్యాలయాలకే పరిమితం కావడంతో యువత నిరుత్సాహానికి గురవుతున్నారు.
మున్సిపాలిటీలు, గ్రామాల్లో..
గత ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2022వ సంవత్సరం జూన్ 2న ప్రతీ గ్రామం, పట్టణాల్లో అనువైన స్థలాలు గుర్తించగా.. గ్రామాలు, మున్సిపాలిటీల్లో స్థల లభ్యత, జనాభా ఆధారంగా రెండు నుంచి మూడు ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ ఆడేలా కోర్టును సిద్ధం యువత, చిన్నారులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రాలేదు. ఇక ఆరు నెలల క్రితం క్రీడా సామగ్రిని తెలంగాణ క్రీడాశాఖ ద్వారా పంపిణీ చేసింది. క్రికెట్, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, స్కిప్పింగ్‌తో పాటు పలురకాల పరికరాలను సమకూర్చగా..వీటిని కార్యాలయాలకే పరిమితం చేశారు. ఒక్కొక్కటి రూ.63వేల విలువైన కిట్లను ఖమ్మం జిల్లాకు 606, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 730 సమకూర్చారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీలకు సరఫరా చేయగా అక్కడి నుంచి అధికారులు గ్రామపంచాయతీలకు అప్పగించారు. కానీ గ్రామపంచాయతీ కార్యాలయాలు దాటి క్రీడాప్రాంగణాలకు ఇవి చేరలేదు. ఒక్కో కిట్‌లో జిమ్ పరికరాలతో పాటు క్రికెట్, వాలీబాల్ సామగ్రి ఉంది. క్రికెట్ బ్యాట్లు, గ్లౌజ్‌లు, లెగ్ ప్యాడ్లు, వికెట్లు, బంతులు, వాలీబాల్‌కు సంబంధించి సింథటిక్ బాల్స్, సైకిల్ పంపు, జిమ్ పరికరాల్లో డంబెల్స్, మెసరింగ్ టేప్, డిస్కస్ త్రో, టెన్నికాయిట్ రింగ్స్, స్కిప్పింగ్ తాళ్లు, విజిల్స్, స్టాప్‌వాచ్‌తో పాటు క్రీడాకారులకు టీషర్టులు ఉన్యాని. అయితే, ఈ కిట్లు ప్రాంతణాలకు చేరక జీపీ కార్యాలయాల్లో పడి ఉండగా.. వేసవి సెలవుల్లో శిక్షణ పొందుతామని భావించిన వారికి నిరాశే ఎదురవుతోంది.
అస్తవ్యస్తంగా ప్రాంగణాలు
గ్రామాల పరిధిలో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. ఆటలు ఆడేలా చదును చేయించడంతో పాటు వాలీబాల్, ఖోఖో కోర్టులు సిద్ధం చేసి సింగిల్, డబుల్‌బార్ కూడా ఏర్పాటుచేశారు. ఉన్నా కానీ చాలా గ్రామాల్లో స్థలాల కొరతతో ఊరికి దూరంగా, శ్మశానవాటికల పక్కన, పాఠశాలల ప్రాంగణాల్లో ఏర్పాటుచేయడంతో ఉపయోగంలోకి రావడం లేదు.ఇక పట్టణాల్లోనూ వార్డుకో క్రీడా ప్రాంగణం ఏర్పాటుచేయాల్సి ఉన్నా స్థలకొరతతో నాలుగైదు వార్డులకు కలిపి ఒకటి ఏర్పాటు చేశారు. ఆతర్వాత సరైన వసతులు కల్పించక.. శిక్షణ ఇచ్చేవారు లేక యువకులు, క్రీడాకారులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అనంతరం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చాలాచోట్ల క్రీడా ప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా మారాయి.
వినియోగంలోకి తీసుకురావాలి..
గత ప్రభుత్వం హడావుడిగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ వసతులు లేక ఆదరణకు నోచుకోవడం లేదు. పంచాయతీ బాధ్యులు పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. ఇకనైనా క్రీడాకారులకు కిట్లు అందించి ప్రాంగణాలను వినియోగంలోకి తేవాలి.
– భూక్యా రమేష్, సీపీఎం నాయకుడు
క్రీడా ప్రాంగణాల నిర్వహణపై దృష్టి
గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతను పంచాయతీలే చూడాల్సి ఉంటుంది. ఈ విషయమై గ్రామ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించేలా ఆదేశాలు ఇస్తాం. అలాగే, క్రీడా కిట్లను ఉపయోగంలోకి వినియోగంలోకి తేవాలని సూచిస్తాం.
– వి.చంద్రమౌళి, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం

జీపీల బాధ్యులకు కిట్లు పంపిణీ చేస్తున్న అధికారులు (ఫైల్)


