
వైన్స్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంక్రైం: వైన్స్ షాపుల దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈనెల 23 వరకు పొడిగించింది. జిల్లాలో 116 వైన్స్‌కు శనివారం వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని తొలుత ప్రకటించారు. ఈమేరకు శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 4,043 దరఖాస్తులు అందగా ఎకై ్సజ్ శాఖకు రూ.121.29కోట్ల ఆదాయం లభించింది. అయితే, బీసీల బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోక డీడీలు తీయలేకపోయామని పలువురు విన్నవించడంతో రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎౖక్సైజ్ అధికారి నాగేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, 27వ తేదీ డ్రా తీసి వైన్స్ కేటాయిస్తామని వెల్లడించారు.
అప్రమత్తతతోనే
ప్రమాదాలు దూరం
నేలకొండపల్లి: దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఇదే సమయాన బాణసంచా కాల్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని 108 సర్వీసుల ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.శివకుమార్ సూచించారు. నేలకొండపల్లిలో ఆదివారం 108 వాహనం పనితీరు, రికార్డులను పరిశీలించాక ఆయన మాట్లాడారు. టపాసులు కాల్చే సమయాన అజాగ్రత్తగా ఉండడంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు పిల్లలు కాల్చే సమయాన పెద్దలు పర్యవేక్షించాలని, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాన 108 సేవలను వినియోగించుకోవాలని, తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.
ఎంపీ దీపావళి
శుభాకాంక్షలు
ఖమ్మం మామిళ్లగూడెం: దీపావళి పండుగతో పాటు సదర్ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించడానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే, యాదవ సమాజం అన్ని జాగ్రత్తల నడుమ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు.
ఎత్తులు.. పై ఎత్తులు !
● హోరాహోరీగా రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మం టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రస్థాయి చెస్ టోర్నీ నిర్వహించారు. అండర్ – 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహించగా వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–8 బాలుర విభాగంలో లావుడ్యా చౌహాన్, కార్తికేయ, దర్శన్‌రెడ్డి, ఈశ్వర్, హర్ష, అండర్–10లో శివనాగసారయి, అరిహంత్, గౌతమ్‌కృష్ణ, నిఖిల్‌చంద్ర, విశ్వతేజ, అండర్–12లో ఎస్.గౌతమ్ చంద్రమోఖిత్, రామ్ నిఖిత్, భూక్యా తనీష్, ఆర్యన్‌శర్మ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. అలాగే, బాలికల అండర్–8 విభాగంలో సహస్ర, సామికా, తేజశ్రీ, జిహిత, జితిషా, అండర్–10లో అంధ్య, అనికారామ్, కార్తీక్ ప్రణవ్, అధ్విక గౌరీ, శరణ్యప్రియ, అండర్–12లో భవజ్ఞ, రీతూశ్రీ, కృతధార, నిహారిక, దిలీషా, అండర్–14 బాలికల విభాగంలో లక్ష్మి, హర్షిత, శ్రీసాత్విక, సిరిలయ, ఆరాధ్య మొదటి ఐదు స్థానాల్లో నిలవగా నిర్వాహకులు బహుమతులు అందజేశారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రఫీ, ఆర్గనైజర్ టి.వీరన్నతో పాటు శివకృష్ణ, కావ్య, హుస్సేన్ పాల్గొన్నారు.