
● వందనంలో ఇంటర్ విద్యార్థి మృతి ● ఇంజక్షన్ వికటించడంత
అండర్–19 బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్, కరాటే జట్ల ఎంపిక పోటీలు ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలను కోచ్‌లు జి.రాము, గోపతి సైదులు ఎస్.కే.ఖాసీం, ఎం.బాబు, ఎండీ. మహహబూబ్, ఎం.సురేష్, హరీష్, ఎం.సందేష్ పర్యవేక్షించగా జట్ల వివరాలను అండర్–19 క్రీడల కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం ప్రకటించారు. అండర్–19 బ్యాడ్మింటన్ బాలుర జట్టుకు ఎన్.నవీన్ ఉదయ్, ఎం.రాజీవ్, డి.నవీన్, ఎ.అరవింద్, జి.నవదీప్, బాలికల జట్టులో బి.ధరణి ప్రియ, ఎ.రష్మీ, కె.హెమీమా, ఎస్.గాయత్రి, జి.మహాలక్ష్మి స్థానం దక్కించుకున్నారు. అలాగే, కరాటే జట్టులో వివిధ కేటగీరీలకు గాను కె.అరుణతేజ్, డి.గౌరీశంకర్, కె.హర్షతేజ, కె.గణేష్, షాహిద్, ఎం.డీ. అసదుద్దీన్, ఎస్.కే.రియాన్, ఎం.లాస్యశ్రీ, వి.లక్ష్మీశ్రావణి, బి.సహస్రసేన్, ఎం.డీ.హఫషాజబీన్, కె.నిఖిత ఎంపికయ్యారు.
నిర్లక్ష్య వైద్యానికి నిండు ప్రాణం బలి..
చింతకాని: ఓ గ్రామీణ వైద్యుడి(ఆర్‌ఎంపీ) నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. తెలిసీ తెలియని వైద్యంతో జ్వరంతో వచ్చిన విద్యార్థికి ఇంజక్షన్ ఇవ్వడంతో అది కాస్తా వికటించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీంతో విద్యార్థి కుటుంబసభ్యులు మృతదేహంతో గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని వందనం గ్రామానికి చెందిన ఉద్వి జస్వంత్ (17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చి అదే రోజు కొదుమూరు గ్రామంలోని గ్రామీణ వైద్యుడికి చూపించాడు. అతడు ఓ ఇంజక్షన్ వేయగా.. వెంటనే వాంతులు చేసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కొద్దిసేపటికి మృతి చెందాడు. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు గ్రామీణ వైద్యుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరేందర్, ఏఎస్సై లక్ష్మణ్ అక్కడకు చేరుకొని కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. మృతికి కారకుడైన గ్రామీణ వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రొటోవేటర్ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
రఘునాథపాలెం: రొటోవేటర్ ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. సీఐ ఉస్మాన్‌షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండ గ్రామానికి చెందిన మాదాసు నారాయణ (35) మంచుకొండలోని ఖాసీమ్‌కు చెందిన మామిడి తోటలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం రొటోవేటర్‌ను ట్రాక్టర్‌కు ఫిట్టింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఖమ్మంరూరల్: మండలంలోని మద్దులపల్లి వద్ద నాగార్జున సాగర్ కాల్వలో గుర్తు తెలియని ఓ వ్యక్తి(34) మృతదేహం లభ్యమైంది. మద్దులపల్లి గ్రామ శివారులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో పల్లెగూడెం బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం.రాజు తెలిపారు.