
ఇందిరా డెయిరీ నా చిరకాల వాంఛ
● పాల ఉత్పత్తులతో దేశానికే ఆదర్శంగా నిలవాలి ● వైరా అభివృద్ధికి నిధులు.. అక్కడి నుంచే ఈ స్థాయికి చేరా ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బోనకల్/వైరా : పాల ఉత్పత్తులతో మధిర నియోజకవర్గ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుతో తన చిరకాల వాంఛ నెరవేరుతుందని తెలిపారు. బోనకల్‌లో ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2013లో మధిర నియోజకవర్గంలో 52వేల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండేసి గేదెలు పంపిణీ చేసి డెయిరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కానీ అదే సమయాన రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మధిర నియోజకవర్గంలోని మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న తన లక్ష్యం నెరవేరడానికి మార్గం ఏర్పడిందని తెలిపారు.
రెండేసి గేదెలు.. సోలార్ ప్లాంట్లు
ప్రతీ సభ్యురాలికి రెండేసి గేదెలు పంపిణీ చేయడమే కాక పాకల నిర్మాణం, సోలార్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని భట్టి వివరించారు. అలాగే, దాణా సరఫరా బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర హస్తకళలు, గిడ్డంగుల సంస్థల చైర్మన్లు నాయుడు సత్యం, రాయ ల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ, పీఆర్, విద్యుత్ శాఖ, భగీరథ ఎస్‌ఈలు యాకోబు, వెంకటరెడ్డి, శ్రీనివాసాచారి, శేఖరరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, ఏడీఏ విజయచందర్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ ఆర్.రమాదేవి పాల్గొన్నారు.
వైరాకు మరిన్ని నిధులు..
వైరా అభివృద్ధికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు మంజూరు చేస్తానని, ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతోనే ఈస్థాయికి చేరానని భట్టి విక్రమార్క అన్నారు. ఆది వారం వైరాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైరాలో రూ. 500 కోట్లతో త్వరలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. అంతకుముందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైద్యులు కాపా మురళీకృష్ణ, ఉండ్రు శ్యాంబాబుతో పాటు 100 కుటుంబాల వారు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, ఏదునూరి సీతారాములు, బోళ్ల గంగారావు, దాసరి దానియేలు పాల్గొన్నారు.

ఇందిరా డెయిరీ నా చిరకాల వాంఛ