
తుది నిర్ణయం ఏఐసీసీదే..
● డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ● డీసీసీకి 56, నగర అధ్యక్ష పదవికి 10 దరఖాస్తులు ● ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వెల్లడి
ఖమ్మంమయూరిసెంటర్ : కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర అధ్యక్ష పదవులకు నాయకుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధ్యక్ష పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్ వారం రోజుల క్రితం ఖమ్మం చేరుకున్నారు. తొలి రోజు నుంచే దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రతీ నియోజకవర్గంలోని రెండు బ్లాక్‌ల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా ఆయన 3,700 మందితో మాట్లాడారు. అధ్యక్ష పదవులకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం ముగియగా.. డీసీసీ అధ్యక్ష పదవికి 56 మంది, నగర అధ్యక్ష పదవికి 10 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరితోనూ మహేంద్రన్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవులకు వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 6, నగరానికి 6 దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి 25వ తేదీ లోగా ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. అందులో నుంచి ఒకరిని డీసీసీ అధ్యక్ష పదవికి, ఒకరని నగర అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని వివరించారు. కాగా, జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన మహేందరన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్ రాపర్తి శరత్ తదితరులు కలిశారు.