
కల్లూరుకు సరికొత్త శోభ
● రూ.49 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సబ్‌కలెక్టర్ కార్యాలయ నిర్మాణం ● మంత్రి తుమ్మల సూచనలతో ప్రతిపాదనలు
సత్తుపల్లి/కల్లూరు : సుమారు పది ఎకరాల స్థలంలో రూ.49 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయ నిర్మాణం జరగనుండగా కల్లూరు కొత్తశోభ సంతరించుకోనుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా దీనిని డిజైన్ చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఇది రూపుదిద్దుకుంటుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో ఈ మేరకు ప్రతిపాదనలను సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ సిద్ధం చేసి ఆదివారం మంత్రికి అందజేశారు. అంతేకాక సబ్‌కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని మరో రూ.2.50 కోట్లతో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు సులువుగా అందుతాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక ప్రతిపాదనలు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ప్రభుత్వ, ఎన్నెస్పీ భూములను పరిరక్షించాలని, సత్తుపల్లి వేశ్యకాంతల చెరువులో ఆక్రమణలు తొలగించాలని మంత్రి సూచించారు. అంతేకాక వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలో గ్రామకంఠం భూములను సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.