
అరెస్టులతో సమ్మెను ఆపలేరు
ఖమ్మంమయూరిసెంటర్: తగ్గించిన వేతనాలు పెంచాలని, జీఓ 60 ప్రకారం రూ.15,600 వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 38 రోజులుగా సమ్మె చేస్తూ మంత్రులకు, అధి కారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు కె.బ్రహ్మచారి అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో విధులు నిర్వర్తిస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఖమ్మంలో మంత్రుల క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించేందుకు ఎన్నెస్పీ క్యాంపునకు చేరుకున్నారు. మూడు జిల్లాల నుంచి వచ్చిన కార్మికులను పోలీసులు ఎన్నెస్పీ క్యాంపులో అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ 38 రోజుల్లో 20 సార్లు ఆర్థిక శాఖ మంత్రికి తమ గోడు వినిపిస్తూ వినతిపత్రం ఇచ్చామని, అయినా స్పందన లేదని అన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన కార్మి కులను అరెస్టు చేయించడం దుర్మార్గమని అన్నారు. డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ అమలు చేయాలని, అప్పటి వరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ వర్కర్లకు ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో రూ.15,600 వేతనం చెల్లిస్తుంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం రూ.9,200 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. అరెస్టులతో సమ్మె ఆపలేరని, సమస్యలు పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వెల్లడించారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జెల్లా ఉపేందర్, దొడ్డా రవికుమార్, నాగేశ్వరరావు, అనంతరాములు, లక్ష్మణ్, మోహన్, కౌసల్య, నర్సింహరావు, లక్ష్మి, శ్రీను, హీరా లాల్, ముత్త య్య, మంగమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు.