
ఖమ్మం: వివాహేతర సంబంధం విషయం బయటపడడంతో మందలిస్తున్న భర్తను అడ్డు తొలగించేందుకు ఓ మహిళ తన సన్నిహితుడితో హత్య చేయించింది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు నిందితుడు, వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తుపల్లి సీఐ మోహన్‌బాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన చిమట కేశవరావు– సత్యవతి భార్యాభర్తలు. ఇందులో సత్యవతికి అదే గ్రామానికి చెందిన చిమట రాముతో ఏడాదిన్నర క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతేర సంబంధానికి దారి తీసింది.
వీరి నడుమ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకోలుకు చెందిన గంపా జోజిబాబు మధ్యవర్తిగా సహకరించేవాడు. కొన్నాళ్లకు ఈ విషయం బయటపడడంతో సత్యవతిని కేశవరావు మందలించాడు. ఇది జీర్ణించుకోలేని ఆమె రాముకు చెప్పి తన భర్తను హత్య చేయాలని కోరింది. ఇంతలోనే ఈనెల 1వ తేదీన రాముకు కేశవరావు ఫోన్ చేసి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మందలించాడు.
దీంతో రాము తనను క్షమించాలని కోరడంతో పాటు ఓసారి కలుద్దామని చెప్పాడు. ఈమేరకు లింగగూడెంలోని మర్రిచెట్టు వద్దకు కేశవరావు వచ్చాక తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తూ ఆయిల్‌పామ్ తోటలో కత్తితో దాడి చేశాడు. అయితే, కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉండడంతో ప్లాస్టిక్ కవర్‌ను మెడ, తల చుట్టూ కట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో కన్నుమూశాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై సరిహద్దు సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం శివార్లకు తీసుకొచ్చి ఆయిల్‌పామ్ తోటలో వేసి వెళ్లిపోయాడు.
కాగా, మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఎలాగైనా పట్టుబడతాననే భయంతో రాము గ్రామ పెద్దలకు చెప్పి సత్తుపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం ఆయన ఇచ్చిన సమాచారంతో శనివారం లింగగూడెం వెళ్లి సత్యవతిని, మంకోలు వెళ్లి గంప జోజిబాబుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మోహన్‌బాబు వెల్లడించారు.