అమాత్యగిరి కోసం పైరవీలు | - | Sakshi
Sakshi News home page

అమాత్యగిరి కోసం పైరవీలు

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ త్వరలో అధికార బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి. కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న పలువురు నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా పైరవీలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో జిల్లాలోని సీనియర్‌ శాసన సభ్యులు మంత్రి పదవిపై కన్నేశారు. ఈ రేసులో సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌, విధాన పరిషత్‌ సభ్యులు బసనగౌడ బాదర్లి, శరణేగౌడ, వసంత్‌ కుమార్‌లున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఇంకా ముహూర్తం ఖరారు కాక ముందే జోరుగా చర్చలు సారుగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో సక్రమంగా పని చేయని కొందరు మంత్రులను తొలగించడానికి అధిష్టానం సిద్ధమైంది. అందులో భాగంగా మంత్రులు బోసురాజు, రహీంఖాన్‌, లక్ష్మి హెబ్బాళ్కర్‌, మునియప్ప, దినేష్‌ గుండూరావు, శివానంద పాటిల్‌ తదితర మరి కొంత మంది మంత్రుల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. డీ.కే.శివకుమార్‌ వర్గంలో శరణేగౌడ బయ్యాపుర, బసన గౌడ దద్దల్‌, సిద్దరామయ్య వర్గంలో హంపనగౌడ బాదర్లి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె వర్గంలో విధాన పరిషత్‌ సభ్యుడు వసంత్‌ కుమార్‌ల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లా నుంచి స్థానంపై పలువురి కన్ను

నేతల ప్రసన్నానికి జోరుగా ప్రయత్నాలు

Advertisement
 
Advertisement
Advertisement