ముందుగా రోడ్డు.. ఆ పై డ్రైనేజీ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ముందుగా రోడ్డు.. ఆ పై డ్రైనేజీ నిర్మాణం

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. అంతేగాక ప్రజల కోట్లాది రూపాయల పన్నుల సొమ్మును వృథాగా మట్టి పాలు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరత వల్ల కోట్లాది రూపాయలు నిరుపయోగం అవుతున్నాయి. రూ.2 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించాకే రోడ్డు నిర్మించాలి. అయితే హుబ్లీలో ముందుగా రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రస్తుతం అదే రోడ్డును తవ్వి యూజీడీ నిర్మిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఎరడెత్తినమఠ ఎదుట సుమారు రూ.2 కోట్ల పాలికె ప్రత్యేక నిధుల వ్యయంతో వీరాపుర వీధి నుంచి యల్లాపుర వీధి వరకు సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మించేటప్పుడే స్థానికులు ఈ ప్రాంతంలో యూజీడీ వసతి లేదని తెలిపారు. దీంతో ముందుగా యూజీడీ పనులు పూర్తి చేశాక రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాలికె అధికారులకు ఎన్నో సార్లు సూచించారు.

ప్రజల మాటలను పెడచెవిన పెట్టి..

అయినా స్థానికుల మాటలను పట్టించుకోని అధికారులు యూజీడీ వేయకుండానే సీసీ రోడ్డు నిర్మించారు. ఫలితంగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఉన్నఫళంగా నాశనం చేస్తున్నారు. ఇదేంటని నిలదీస్తే యూజీడీ పనులు అని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు చెబుతున్నా పట్టించుకోని పాలికె అధికారులు కోట్ల వ్యయాన్ని ఇలా మట్టి పాలు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయం లేక పోవడంతో ప్రజాధనం మట్టిపాలు అవుతోందని ప్రజలు ఆరోపించారు. ఈ విషయమై మేయర్‌ జ్యోతి పాటిల్‌ స్పందించారు. నాణ్యత గల రోడ్లను సరి చేసే పని కావడం లేదు. దీంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఇప్పటికై నా పాలికె అధికారులు బాధ్యతతో నడుచుకొని ప్రజాధనం వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

రూ.కోట్లాది ప్రజాధనం వృథా

హుబ్లీలో అధికారుల తీరు విడ్డూరం

Advertisement
 
Advertisement
Advertisement