కన్నతల్లిని చంపి.. బూడిద చేసి | - | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని చంపి.. బూడిద చేసి

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

అనుమానంతో.. కొడుకు కిరాతకం

మైసూరు జిల్లాలో ఘోరం

మైసూరు: జిల్లాలో అత్యంత అమానుషమైన ఘోరం వెలుగుచూసింది. కని పెంచిన తల్లి అనే ప్రేమ లేకుండా ప్రాణాలు తీశాడో కర్కోటకుడు. తల్లి రుణం తీర్చుకోవడానికి బదులు ఆమె రక్తం కళ్లజూసిన ఘటన మైసూరు తాలూకా మాదహళ్లి గ్రామంలో జరిగింది. శివరుద్రప్ప (30) అనే కుమారుడు తల్లి సుధా (48)ను కిరాతకంగా అంతమొందించాడు. తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందని, పదేపదే చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని కుమారుడు తరచూ గొడవ పడేవాడు. ఇటీవల ఆమె, ఆ వ్యక్తితో బైక్‌పై కలిసి వెళ్తుండగా చూసి రగడకు దిగాడు.

తలపై బండ వేసి..

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కోపంతో ఆమైపె దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాను బంధువులు ఆస్పత్రిలో చేర్పించేందుకు యత్నిస్తుండగా శివరుద్రప్ప తానే తీసుకెళ్లి, కొంతదూరం వెళ్లాక ఆమె తలపై బండరాయిని ఎత్తివేసి చంపేశాడు. కణియనహుండి సమీపంలోని తోటలో తల్లి శవాన్ని కాల్చివేసి బూడిద చేసి పరారయ్యాడు. అతనికి చిన్నాన్న కుమారులు ఆకాశ్‌, అభి సహకరించారు. కేసు ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

మైసూరులో గంజాయి సీజ్‌

మైసూరు: ముగ్గురు డ్రగ్స్‌ విక్రేతల నుంచి సుమారు రూ. 5.5 లక్షల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. 11 కేజీల గంజాయి, కారు పట్టుకున్నారు. మంజ, కుంటె మంజ, బీఆర్‌ కార్తీక్‌ అప్పాజీ అనేవారిని అరెస్టు చేశారు. వీరు స్విఫ్ట్‌ కారులో గంజాయి తరలిస్తున్నారని తెలిసి ఆలనహళ్లి పోలీసులు కాపుకాచి నిర్బంధించారు. నిందితులు గతంలోనూ గంజాయి కేసులో అరెస్టు అయి బెయిల్‌మీద బయటకు వచ్చారు.

ఎరువుల కొరత తప్పదు: మంత్రి

శివాజీనగర: రాష్ట్రంలో 38 వేల మెట్రిక్‌ టన్నుల రసాయనిక ఎరువుల కొరత ఉంది. 14 వేల టన్నుల యూరియా కొరత ఉంది. ఇరాన్‌ యుద్ధం వల్ల ఎరువులు అందడం లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామి తెలిపారు. సోమవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఎరువుల కొరతపై కేంద్రంతో చర్చిస్తున్నాం, రసాయనిక ఎరువులను తగ్గించి సహజ ఎరువులను రైతులు ఉపయోగించాలి, జూన్‌లో వ్యవసాయ పనులు మొదలవుతాయి, ఈ ఖరీఫ్‌ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి 30 లక్షల టన్నుల వివిధ రకాల రసాయన ఎరువులను పంపిణీ అయ్యాయి అని తెలిపారు. తాము కోరినంతగా కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా, డీఏపీ రసాయనిక ఎరువులు అందలేదు, దీంతో ఈ సీజన్‌లో ఎరువుల కొరత తప్పదని తెలిపారు.

మత సమైక్యతపై పాఠాలొద్దు

యశవంతపుర: ఓ చిత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఆరోపణలకు కారణమైంది. ఉడుపిలో జిల్లా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ వద్దకు ఓ వృద్ధ హిందూ మహిళను ఇద్దరు ముస్లిం మహిళలు తీసుకువచ్చి, ఆమెకు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి సాయం చేయాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ ఘటన మత సమైక్యతకు చిహ్నమని, బీజేపీ నాయకులు ఇది చూసి నేర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కానీ బీజేపీ నేతలు ప్రతిస్పందిస్తూ ఆ వృద్ధురాలు గిరిజా శెట్టిగార్‌ అయితే, ముస్లిం మహిళ్లలో ఒకరు ఆమె కూతురని, 25 ఏళ్ల క్రితం మతమార్పిడి చేసుకుందని చెప్పారు. మత సౌహార్ధ్రత మీద కాంగ్రెస్‌ నుంచి పాఠాలు నేర్చుకోవసిన పని లేదని మహిళా మోర్చా నాయకులు మండిపడ్డారు.

లంచం కేసు కొట్టివేతకు నో

యశవంతపుర: లంచం కేసులో ప్రభుత్వ ఉద్యోగి కాదనే కారణం చూపి విచారణను రద్దు చేయడం సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అధికారుల తరఫున లంచం తీసుకున్న మధ్యవర్తిపై దాఖలైన కేసు రద్దుకు తిరస్కరించింది. బెంగళూరు బసవేశ్వర నగరకు చెందిన కెఎస్‌ గంగాధరయ్య అనే వ్యక్తి ఓ అధికారి తీసుకునే కేసులో నిందితునిగా ఉన్నాడు. ఇతడు ట్రాన్స్‌పోర్టు కంపెనీ నడుపుతున్నాడు. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అవినీతి కేసు వర్తించదని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన జడ్జి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న అతని వకీలు వాదనను తిరస్కరించారు. లోకాయుక్త విచారణను పరిశీలిస్తే కేసును కొట్టివేయటం సాధ్యం కాదని తీర్పునిచ్చారు.

యూత్‌ కాంగ్రెస్‌ భేటీలో రగడ

శివాజీనగర: బెంగళూరులోని క్వీన్స్‌ రోడ్డులో ఉన్న కేపీసీసీ కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ రసాబాసగా జరిగింది. యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు దీపికారెడ్డి మద్దతుదారులు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మంజునాథ్‌గౌడ వర్గాలు గొడవపడ్డాయి. మే 21న నీట్‌ అక్రమాలను ఖండిస్తూ ధర్నాలను జరపడం గురించి ముందస్తు సమావేశం నిర్వహించారు. అయితే నోటీస్‌ ఇవ్వకుండా 15 మంది పదాధికారులను తొలగించారని కొందరు ప్రస్తావించడంతో గొడవ మొదలైంది. తొలగించినవారిలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దీపికారెడ్డి, ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసేస్తారని ప్రశ్నించడంతో తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. మంజునాథగౌడ, సీనియర్‌ నేత నిగం భండారీని ఘోరావ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement