ధాన్యం కొనుగోళ్లు ఎన్నడో? | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు ఎన్నడో?

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

హొసపేటె: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన అన్నదాతలకు కాలం కలసి రావడం లేదు. అప్పులు చేసి మరీ వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ప్రస్తుతం పంట నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెట్టారు. అయితే దాన్యం కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రావడం లేదు. తుంగభద్ర జలాశయం క్రస్ట్‌ గేట్లలో మార్పు కారణంగా రెండవ పంటకు నీరు అందుబాటులో లేదు. ఎరువుల ధరలు, కూలీల సమస్యలతో వరి పండించే రైతులకు సరైన ధరలు లభించడం లేదు. విజయనగర జిల్లా హోస్పేట్‌ తాలూకాలో ఉన్న నాగేనహళ్లి, కమలాపూర్‌, హంపీ తదితర ప్రాంతాల్లో 500 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. పంట కాలం పూర్తి కావడంతో పంటను నూర్పిడి చేసి ఆరబోశారు. రైతులు పండించిన వరిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌ వరికి రూ.2440 మద్దతు ధర ప్రకటించింది. అయితే జిల్లాలో వరి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ మద్దతు ధర కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దళారుల చేతివాటం..

జిల్లాలో వరి కోతలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. అయితే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కోతలు పూర్తయి, పెద్ద మొత్తంలో వరి ధాన్యం విజయనగర, బళ్లారి జిల్లాల మార్కెట్లకు చేరుకుంటోంది. జిల్లాలో వరి కొనుగోలుదారులు లేరు. దీనిని ఆసరాగా చేసుకున్న దళారులు.. తక్కువ ధరకు వరిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు పండించిన వరికి ప్రభుత్వం ఎందుకు సరైన ధర నిర్ణయించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, విద్యుత్‌, రవాణాతో సహా అన్ని ధరలను పెంచుతున్నప్పటికి.. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ఎలాంటి ధరలు పెంచక పోవడం విడ్డూరం. ఎన్నికల ప్రసంగాల్లో రైతులు దేశానికి వెన్నెముక అని సుదీర్ఘ ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు.. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం లేదు. రైతులు పండించే పంటలకు సరైన ధర అందేలా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు.

రైతుల గోడు పట్టదా?

ఒక ఎకరంలో వరి పండించడానికి రైతులకు విత్తనాలు, నారు, ఎరువులు, పురుగు మందులు అవసరం. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వాలు రైతులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. వారికి రైతు సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎరువులు, విద్యుత్‌, రవాణా, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచినట్లే రైతులు పండించే పంటల ధరలను కూడా ప్రతి ఏటా పెంచాలని రైతు సంఘం నేతలు తలవార్‌ నాగరాజ్‌, సన్నక్కి రేవుద్రప్ప డిమాండ్‌ చేస్తున్నారు. పంటలకు సరైన ధర లభించకపోతే రాబోయే రోజుల్లో రైతులు నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం

వరి రైతుకు మద్దతు అంతంతే..

ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement