హరహర శంభోశంకరా
సాక్షి, బళ్లారి: నగరంలో ఆదివారం మహాశివరాత్రి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు రాత్రంతా ఆలయాల్లో జాగరణ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తిగీతాలు ఆలపిస్తూ శివుడికి పూజలు చేశారు. నగరంలోని కోట మల్లేశ్వర ఆలయం, కాశీ విశ్వేశ్వర ఆలయం, నగరేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం తదితర శివాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణ మార్మోగింది. హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
శివలింగాలకు అభిషేకం..
రాయచూరు రూరల్: జిల్లాలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని మహాబలేశ్వర చౌక్‌లో చంద్ర మౌళేశ్వర దేవాలయం వద్ద రాత్రి 12 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. నగరేశ్వర, వీరభద్ర దేవస్థానం, ఐబీ రోడ్డులోని నందీశ్వరాలయం, రామలింగేశ్వర దేవాలయల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివస్తోత్రం, కుంభాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. రామ మందిర్, హనుమాన్ మందిర్, రాజమాత గుడి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థశ్రీపాదంగల్, కిల్లే మఠంలో శాంతమల్ల శివాచార్యులు శివలింగాలకు అభిషేకం చేశారు.
అళంద దర్గాలో..
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలో శివరాత్రి పర్వదినం సందర్భంగా అళందలో లాడ్లే మశాక్ దర్గాలో రాత్రి 12 గంటల నుంచే భక్తులు పూజలు చేశారు. శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. రాఘవ చైతన్య శివలింగ పూజ వివాదంగా మారడంలో హైకోర్టు నుంచి అనుమతి పొంది పూజలు చేశారు.
హంపీలోని విరుపాక్షేశ్వర స్వామికి పూజలు
శ్రీశైల బ్రమరాంభిక
మల్లికార్జునుడికి అభిషేకం
పూజలందుకున్న భువనేశ్వరి దేవి
అలంకరణలో
హంపీలోని పంపాదేవి
ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
భక్తులతో శివాలయాలు కిటకిట
మార్మోగిన శివనామస్మరణ
ఉపవాస దీక్షలతో జాగరణ
ఆకట్టుకున్న ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర
హంపీకి పోటెత్తిన భక్తులు
హొసపేటె: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం దక్షిణ కాశీగా వెలుగొందిన హంపీలో భక్తుల కోలాహలం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శివుడి దర్శనం చేసుకునేందుకు ఉదయం ఐదు గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హోస్పేట్‌లోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద భక్తులు క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం
రాయచూరు రూరల్: ఆధ్యాత్మిక, సంస్కృతి, ఆచార, సాంప్రదాయాలకు భారతదేశం నిలయమని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతి, మత, కుల, వర్గ, సంఘర్షణల మధ్య భారతీయులు నలిగిపోతున్నారన్నారు. నైతిక విలువలకు గౌరవం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం సంచాలకురాలు స్మిత మాట్లాడుతూ.. పరంజ్యోతి స్వరూపం సత్య శివరాత్రి అని తెలిపారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేందుకు సత్య జ్ఞానాన్ని అందించేందుకు శివుడు ప్రత్యక్షమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం కార్లపై ద్వాదశ జ్యోతిర్లింగాలను ఊరేగించారు.
హరహర శంభోశంకరా
హరహర శంభోశంకరా
హరహర శంభోశంకరా


