ఆరోగ్యంపై అవగాహనకే మారథాన్
బళ్లారి అర్బన్: తొలి కురుగోడు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ శివారులోని వడ్డట్టి క్రాస్ నుంచి పెద్ద బసవేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించిన మారథాన్‌ను కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జేఎన్.గణేష్ ప్రారంభించారు. యువకులు, యువతులు, 40 ఏళ్లు పైబడిన పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంపై అవగాహనకు మారథాన్ పరుగు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. పెద్ద బసవేశ్వర ఆలయం నుంచి కంప్లి రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు మహిళలు రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. ఆలయ గోపురం, నంది విగ్రహం, సామాజిక సందేశాలు, కురుగోడు ఉత్సవానికి స్వాగతం, వంటి ఆకృతులు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కేసరి గడ్డపై పరుగుపందెం పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ మోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో హాబీ కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో కురుగోడు పురసభ అధ్యక్షుడు టి.శేకన్న, తాలూకా గ్యారంటీ పథకాల అమలు కమిటీ అధ్యక్షుడు బసవన గౌడ, తహసీల్దార్ నరసప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.


