కుర్చీ మార్పిడి లేనట్టే | - | Sakshi
Sakshi News home page

కుర్చీ మార్పిడి లేనట్టే

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

కుర్చ

కుర్చీ మార్పిడి లేనట్టే

రాయచూరు జిల్లాలో హట్టి స్వర్ణ గనుల్లో డీసీఎం

శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఎంతగా ప్రయత్నాలు సాగిస్తుంటే, ఆయన సహచరులు అంతగా నిరుత్సాహపరుస్తున్నారు. ఆయనను నీరుగార్చేలా మాటల తూటాలను వదులుతున్నారు. సీఎం మార్పిడి గురించి పార్టీ హైకమాండ్‌ ఏ తీర్మానం తీసుకోకుండా మౌనంగా ఉందంటే, ఎలాంటి మార్పు లేదని అర్థమని హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ అన్నారు. సీఎం స్థానం కోసం డీకే చెమటోడుస్తుండగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పరమేశ్వర్‌ ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు దానిని హైకమాండ్‌ సమర్థవంతంగా పరిష్కరించిందని అన్నారు. ఎప్పుడు, ఎలా వ్యవహరించాలనేది వారికి బాగా తెలుసునని అన్నారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర.. సీఎం కుర్చీ సంగతి ముగిసిపోయిన విషయమని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు. రెండున్నరేళ్ల తరువాత సీఎంను మార్చాలనే ఒప్పందం జరిగిందని డీకే శివకుమార్‌ చెబుతున్న విషయం తనకు తెలియదని పరమేశ్వర్‌ చెప్పడం గమనార్హం. దీని గురించి ఢిల్లీలో చర్చలు జరిగినప్పుడు తాము బయటే ఉన్నాము, సిద్దు, శివకుమార్‌లకు మాత్రమే కచ్చితంగా ఏమిటనేది తెలుసన్నారు. ఒప్పందం ఉందని హైకమాండ్‌ నాయకులు ఇప్పటి వరకు చెప్పలేదు. మాకు ఏమీ తెలియదు కాబట్టే హైకమాండ్‌ వైపు చూపిస్తామన్నారు. కాగా, మెట్రో రైలు చార్జీల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పారు. మరోవైపు సీఎం సిద్దు, డీసీఎం శివ ఆదివారం ఉత్తర కర్ణాటక జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.

హైకమాండ్‌ మౌనమే సాక్ష్యం

హోంమంత్రి పరమేశ్వర్‌ ఘాటు వ్యాఖ్యలు

దేవెగౌడ కుటుంబంపై సీఎం సిద్దరామయ్య కక్ష

కేంద్రమంత్రి కుమారస్వామి

మైసూరు: సీఎం సిద్ధరామయ్య తమ పార్టీని లక్ష్యం చేసుకున్నారని, ఎలాగైనా ముగించాలని చూస్తున్నారని జేడీఎస్‌ అగ్రనేత, కేంద్రమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబం మీద ఓ కేసు ద్వారా జేడీఎస్‌ అధినేత హెచ్‌.డి. దేవెగౌడను మానసికంగా కుంగదీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేవెగౌడ సంరక్షణలో పెరిగిన సిద్ధరామయ్య ఇప్పుడు దేవెగౌడ కుటుంబాన్నే తుదముట్టించాలని చూస్తున్నారన్నారు. తాను కేంద్రమంత్రి కావడం వారికి అసూయ కలిగించిందన్నారు. ఎక్కువ బడ్జెట్లు సమర్పించానంటూ సిద్దరామయ్య గర్వంగా మాట్లాడుతున్నారన్నారు, కానీ పరిపాలన ఏమీ బాగాలేదన్నారు. మద్యం ముడుపులు అందుకున్న అబ్కారీ మంత్రి రాజీనామా చేయలేదన్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యే జి.టి.దేవెగౌడకు ఎక్కడా నిజాయతీ లేదని కుమార ఆరోపించారు. ఆయన ఇప్పుడు మనతో లేరని, ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకులతో ఉన్నారని విమర్శించారు. జీటీ తనను చాలా చాలా బాధపెట్టారని పలు సంఘటనలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జేడీఎస్‌ నేతలు పాల్గొన్నారు.

కుర్చీ మార్పిడి లేనట్టే 1
1/1

కుర్చీ మార్పిడి లేనట్టే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement