గజ దండయాత్రలు
బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో గజరాజులు దండయాత్ర చేపట్టాయి. పలు ప్రాంతాలలో తిరుగుతూ దాడులకు తెగబడడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆనేకల్ తాలూకాలోని ఆనేకల్, తమిళనాడు సరిహద్దు గ్రామమైన బైలకెరెలో శనివారం సాయంత్రం అడవి ఏనుగు దాడి చేయడంతో పుట్టస్వామి అనే రైతు మరణించాడు. బైలకెరె నుంచి గుమ్మలాపురానికి నడుచుకుంటూ వెళ్తున్న పుట్టస్వామిని అడవి ఏనుగు తొక్కి చంపింది. ఆనేకల్ తాలూకాలోని సోలూర్‌లో ఒక గున్న, నాలుగు పెద్ద ఏనుగులు అరణ్యం వదిలి ఊళ్ల మీద పడ్డాయి. అటవీ సిబ్బంది పటాకులు కాల్చి తమిళనాడు వైపు తరిమికొట్టారు. కొన్ని వారాలుగా చుట్టుపక్కల గ్రామాలలో ఏనుగుల మందలు తిరుగుతున్నాయి. అటవీ అధికారులు శివరాజు, సిబ్బంది చిన్నస్వామి, నింగయ్య, బసవలింగప్ప తదితరులు కార్యాచరణలో పాల్గొన్నారు.
వీడియోల కోసం పరుగులు
ఏనుగులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని వ్యూస్, లైక్‌లు కొట్టేయాలని యువకులు నానాపాట్లు పడుతున్నారు. ఏనుగుల దగ్గరకు వెళ్తున్న యువకులను అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుంపులు గుంపులుగా ఏనుగుల వైపు వెళ్తూ ఉండడంతో అదుపు చేయడం కష్టమైంది. ప్రజల అరుపులకు భయపడి అడవి ఏనుగులు విపరీతంగా పరిగెత్తుతున్నాయి. ఈ సమయంలో ఓ గున్న గుంతలో పడిపోయింది. అయితే తల్లి ఏనుగు చాలాసేపు శ్రమించి దానికి బయటకు తీసుకొచ్చింది.
బెంగళూరు పరిసరాల్లో కల్లోలం
ఆనేకల్ వద్ద దాడిలో రైతు మృత్యువాత
జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ ప్రచారం
గజ దండయాత్రలు
గజ దండయాత్రలు


