రాష్ట్రాన్ని ఉడ్తా పంజాబ్ కానివ్వం
మైసూరు: కర్ణాటకను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉడ్తా పంజాబ్‌గా మాదిరిగా మత్తు పదార్థాల నిలయంగా మార్చనివ్వమని హోం మంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. శనివారం మైసూరులో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు శాఖలో చాలా సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. మాదకద్రవ్యాల సమస్యపై మేము చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం, బెంగళూరులో ప్రతిరోజూ వందలాది కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. పంజాబ్‌లో ప్రతి ఇంట్లో డ్రగ్స్ దొరికాయని వార్తలు వస్తున్నాయని, అలా కర్ణాటకను కానివ్వబోమన్నారు.
మైసూరులో డ్రగ్స్ ఫ్యాక్టరీలు లేవు
మైసూరులో ఎటువంటి మాదకద్రవ్యాలు కనుగొనలేదని ఇటీవలి డ్రగ్స్ ఫ్యాక్టరీలు గుట్టురట్టయిన సంఘటనను హోంమంత్రి ప్రస్తావించారు. నార్కోటిక్స్ బ్యూరో దాడిలో ఫినాయిల్ కెమికల్ లభించిందని, అయితే బ్యూరోవారు రూ.10 కోట్ల మాదకద్రవ్యాలు దొరికాయని అబద్ధం చెప్పారని హోంమంత్రి ఆరోపించడం గమనార్హం. మైసూరులో మొదటిసారి సోదాల్లో డ్రగ్స్ లేవన్నారు, అంతలోనే మరో మీడియా ప్రకటనలో డ్రగ్స్ దొరికాయని చెప్పారని దుయ్యబట్టారు. తాను మైసూరు పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించినప్పుడు, ఇక్కడ ఏమీ దొరకలేదని తెలిపారన్నారు. ఇలా పత్రికా ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నార్కోటిక్స్ బ్యూరో మీద మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రసాయన కర్మాగారాలను తనిఖీ చేయాలని నేను ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించానని చెప్పారు. ఏ రసాయన కర్మాగారం కూడా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోరాదన్నారు. 15 రోజులకు ఒకసారి తనిఖీలు చేయాలని, ముడి పదార్థాలను పరిశీలించాలని తెలిపారు.
పోలీసులు ప్రజాస్నేహిగా ఉండాలి
తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలను నేరస్థులుగా చూడకూడదు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అనుకూలంగా ఉండాలని హోం మంత్రి తెలిపారు. సిద్ధార్థనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసులు చురుగ్గా పనిచేయాలని, హుబ్లీలో ప్రేమోన్మాది చేతిలో యువతి హత్యకు గురైంది, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అలా జరిగి ఉండేది కాదన్నారు. మైసూరుకు మరింత బాగా పర్యాటకులు రావాలని, పోలీసులు, ప్రజలు టూరిస్టులకు అన్ని రకాల ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. మైసూరులోని చారిత్రక భవనాలను కాపాడుకుంటే మరింత కీర్తి వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీవత్స, ఐజిపి ఎం.బి. బోరలింగయ్య, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ తదితరులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలను అరికడతాం
హోంమంత్రి పరమేశ్వర్


