మాది చేతల ప్రభుత్వం
కూలిన ప్రచార బోర్డు
గృహ వసతి భవనం వద్ద సీఎం, మంత్రులు
హుబ్లీ: మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల సర్కారు, ఒట్టి మాటలతో కాలక్షేపం చేయం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. నగరంలో మురికివాడల అభివృద్ధి మండలి (కేఎస్‌డీబీ) ఆధ్వర్యంలో శనివారం సుమారు 40 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదల కోసం 5 గ్యారెంటీ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ విధానాలపై మండిపడుతూ తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి, మంత్రులు జమీర్ అహ్మద్ ఖాన్, సంతోష్‌లాడ్, సతీష్ జార్కిహొళి, మహదేవప్ప, హెచ్‌కే.పాటిల్, కేహెచ్ మునియప్ప, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
భవనాలలో ఫ్లాట్లు
ఇప్పుడు పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు 3 అంతస్తుల చొప్పున నిర్మించిన అపార్టుమెంట్లలో ఫ్లాట్లను త్వరలోనే లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మురికివాడ ప్రాంతాల ప్రజలు అందరిలా అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు నేతలు తెలిపారు. ఈ సభకు ఇరుపొరుగు జిల్లాల నుంచి ప్రజలను తరలించడంతో కోలాహలం నెలకొంది.
కూలిన బోర్డులు
సభకు ముందు సీఎం తదితరుల చిత్రపటాలతో ఉన్న భారీ బోర్డులు కూలిపడడంతో ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
బీజేపీ ఆందోళన
మరోవైపు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తూ హుబ్లీ నగరంలో బీజేపీ నాయకులు బైఠాయించారు. గవర్నర్‌ను అవమానించారంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని బలవంతంగా వాహనాలలో తరలించారు.
సీఎం సిద్దరామయ్య
హుబ్లీలో ఇళ్ల పట్టాల పంపిణీ
మాది చేతల ప్రభుత్వం


