కుక్కను వెతుకుతూ మృత్యుఒడికి
దొడ్డబళ్లాపురం: ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఇంటి శునకం తప్పిపోయింది. దానిని వెతుక్కుంటూ వెళ్లిన బాలుడు రైలు ఢీకొని మరణించాడు. ఈ విషాద సంఘటన నెలమంగల తాలూకా ముద్దలింగనహళ్లి గేట్ వద్ద జరిగింది. శ్రీనివాస్, చన్నమ్మ దంపతుల కుమారుడు యోగేంద్ర (16) పెంచుకుంటున్న కుక్క 2 రోజుల నుంచీ కనిపించడం లేదు. దీంతో బాధతో ఉన్న యోగేంద్ర శనివారం ఉదయం తల్లిదండ్రులకు చెప్పకుండా కుక్కను వెతుక్కుంటూ వెళ్లాడు. ముద్దలింగనహళ్లి గేట్ వద్ద రైలు పట్టాలపై నడుస్తూ ఉండగా, వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో యోగేంద్ర అక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన యశ్వంతపుర రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రోజులు ఒకేలా ఉండవు
● కాంగ్రెస్‌కు దళపతి హెచ్చరిక
దొడ్డబళ్లాపురం: తన కుమారుడు హెచ్‌డీ రేవన్నను అరెస్టు చేసిన ఎస్‌ఐటీ అధికారులకు ప్రభుత్వం బహుమతులు ఇచ్చింది, రేవన్నను అరెస్టు చేస్తే జేడీఎస్ పనైపోతుందని కాంగ్రెస్ అనుకుంది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. శనివారంనాడు హాసన్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో ఇంటి పనిమనిషి కిడ్నాప్ కేసులో రేవణ్ణను అరెస్టు చేయడం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ దళపతి దుయ్యబట్టారు. హాసన్ జిల్లాలో జేడీఎస్‌ను లేకుండా చేయడం అంత సులువు కాదన్నారు. దేశంలో కాంగ్రెస్ సర్కారు మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉందన్నారు. రాహుల్‌గాంధీ ఎన్ని ఆరోపణలు చేసినా జనం ప్రధాని మోదీకే పట్టం కడుతున్నారన్నారు. నిఖిల్ ప్రసంగిస్తూ తన తండ్రి కుమారస్వామి రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, అందుకు ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. కాంగ్రెస్‌కి తగిన గుణపాఠం చెబుతామన్నారు.
టెన్త్ తాలూకా టాపర్లకు ల్యాప్‌టాప్‌లు
● సర్కారీ బడుల విద్యార్థులకే కానుక
శివాజీనగర: ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలు సమీపిస్తుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి విద్యార్థులకు ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రతి జిల్లాలో తాలూకాలో అత్యధిక మార్కులు పొందిన ముగ్గురు చొప్పున ప్రభుత్వ పాఠశాలల ల్యాప్‌టాప్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే ఒక్కో తాలూకా నుంచి ముగ్గురు మెరిట్ విద్యార్థులను ఎంపిక చేసి కానుకని అందిస్తారు. అలాగే నగదు బహుమతులను కూడా అందిస్తామని తెలిపింది.
ఏటేటా అధ్వానం
రాష్ట్రంలో అనేక జిల్లాల్లో, ప్రత్యేకించి ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో ఉత్తీర్ణత శాతం చాలా నాసిరకంగా ఉంటోంది. ఏటేటా ఆ జిల్లాల్లో తగ్గుముఖం పడుతోంది. దీంతో ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయలేక చదువులకే పుల్‌స్టాప్ పెడుతున్నారు. దీనివల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నట్లు ఆందోళన నెలకొంది. గత ఏడాది ఫలితాలు మెరుగుపడేందుకు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉత్తీర్ణత పెంచితే రూ. వెయ్యి కానుక ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల బహుమతిని తీసుకొచ్చింది.
ఈ గ్యారెంటీలు తాత్కాలికమే
● కేంద్రమంత్రి కుమారస్వామి
తుమకూరు: కాంగ్రెస్ ప్రభుత్వ 5 గ్యారెంటీ పథకాలు తాత్కాలికమే. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి ఏడాదికి రూ. 50 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇవి మీరు చెల్లించే పన్ను డబ్బులే. కానీ మీ నుంచి 1.25 లక్షల కోట్లను తీసుకుంటోంది అని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. తుమకూరు రూరల్‌లోని రాగిముద్దనహళ్లి గ్రామంలో రాగి ముద్దనహల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ర్యాలీ సభలో మాట్లాడారు. ఈ సర్కారు ఇచ్చే 2 వేలతో మోసపోకండి అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ప్రవాహాన్ని సృష్టిస్తోంది. ప్రతి గ్రామంలోని కిరాణా అంగళ్లలోనూ మద్యం లభిస్తోందన్నారు. మద్యం లైసెన్సుల జారీలో కోట్లాది రూపాయల లంచాలు తీసుకుంటున్నారన్నారు. తాను గతంలో వేరొకరి కుతంత్రం వల్ల బీజేపీకి అధికారాన్ని అప్పగించలేకపోయానన్నారు. రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేశానని చెప్పారు.
కుక్కను వెతుకుతూ మృత్యుఒడికి
కుక్కను వెతుకుతూ మృత్యుఒడికి


