ఢిల్లీకి వెళ్లని రాష్ట్ర శకటం
మైసూరు: రాష్ట్రం నుంచి సరైన ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం కేంద్ర గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కర్ణాటక శకటం పాల్గొనడం లేదని మైసూరు ఎంపీ యదువీర్ చామరాజ ఒడెయార్ చెప్పారు. ఆయన శనివారం మైసూరులో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు కర్ణాటక శకటం పంపడం గురించి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సమాచారం ఇవ్వలేదన్నారు. ‘దీని కారణంగా చాలా గందరగోళం నెలకొంది. ఢిల్లీ పరేడ్‌లో ఈ ఏడాది మన శకటం ఉండదు’ అని తెలిపారు. సాధారణంగా రాష్ట్ర గొప్పదనాన్ని చాటే ఓ థీమ్‌తో శకటం పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఒకటీ అరా సందర్భాల్లో తప్పించి దాదాపు ప్రతి సంవత్సరం ఢిల్లీ గణతంత్ర పరేడ్‌లో కన్నడ శకటాలు పాల్గొని కనువిందు చేశాయి.
శాంతిభద్రతలు కరువయ్యాయి
బళ్లారిలో గృహ దహనంపై స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని యదువీర్ అన్నారు. శాంతిభద్రతలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలన్నారు. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్‌ను కాంగ్రెస్ సర్కారు అగౌరవించడాన్ని ప్రజలు అందరూ చూశారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల గూండా ప్రవర్తన ఖండనీయమన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ను ముట్టడించడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని దుయ్యబట్టారు. మైసూరు చాముండి కొండపై అభివృద్ధి పనులను కొందరు స్థానికులు వ్యతిరేకిస్తున్నారని, అధికారులు తొందరపడి పనులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. మైసూరు– కుశాల నగర రైల్వే ప్రాజెక్ట్ నిలిచిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని అప్పగించలేదని అన్నారు. మైసూరు – కొడగు ప్రజల కోసమైనా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మైసూరు ఎంపీ యదువీర్
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వమే కారణమని విమర్శలు


