కాలువలు వెలవెల.. కార్మికులు విలవిల
సజ్జాపుర గ్రామంలో ఇళ్ల వద్ద ఉన్న వృద్ధ మహిళలు
ఆయకట్టు కాలువలో నీటి ప్రవాహం కరువైన దృశ్యం
రాయచూరులో రైలు ఎక్కుతున్న కూలీకార్మికులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఈఏడాది తుంగభద్ర ఆయకట్టు కింద రబీ పంటకు క్రాప్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఒక వైపు పనులు లేక కూలికార్మికులు మూటాముల్లె సర్దుకుని సుదూరంలోని మహానగరాలకు పొట్టకూటి కోసం వలస పోతున్నారు. మరో వైపు రబీ పంట సాగు లేకపోవడంతో పొలాలు బీడు పడి ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆయకట్టు కాలువలకు నీటి సరఫరా నిలిపివేశారు. రైతులు, వ్యవసాయ కూలీలు మహా నగరాలకు వలసలు వెళుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, కొప్పళ, యాదగిరి, కలబుర్గి, బీదర్ జిల్లాల్లో రబీలో కూడా కరువు నెలకొంది. రాయచూరు, కొప్పళ, యాదగిరి, కలబుర్గి జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ కూలీలకు పనులు లభించక బతుకు తెరువు కోసం బెంగళూరు, హైదరాబాద్, ముంబై, షోలాపూర్, గోవా, చైన్నె వంటి ప్రాంతాలకు చేరుతున్నారు.
బోరుబావుల కింద విద్యుత్ కోతలు
పొలంలో బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్ కోత అధికమైంది. మరో వైపు తుంగభద్రా డ్యాం నుంచి రెండో పంటకు నీరు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో వలసలు వెళ్లక తప్పడం లేదు. కాలువల్లో నీరు లేక, వానలు కరువక పంటలు పండక పోవడంతో జీవనోపాధి కోసం వలసలు వెళ్లేందుకు రైతులు మూటాముల్లె సర్దుకుంటున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజు వందలాది మంది బెంగళూరుకు రైలులో బయలుదేరి పోతున్నారు. వారిని కదిలిస్తే కన్నీరు వస్తున్నాయి. గ్రామాల్లో ఇళ్ల వద్ద వృద్ధులను వదిలి పిల్ల పాపలతో వలసలు వెళుతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు వలసల నివారణకు ఏవైనా పథకాలను ప్రారంభించాలనే ఆలోచన ఏ ఒక్కరి మదిలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న బాధలను పరిష్కరించడంలో మౌనం వహిస్తున్నారు.
ఆయకట్టులో రబీ పంటలకు
నిలిచిన నీటి సరఫరా
మూటాముల్లే సర్దుకుని వలస బయలుదేరిన కూలీలు
కాలువలు వెలవెల.. కార్మికులు విలవిల
కాలువలు వెలవెల.. కార్మికులు విలవిల
కాలువలు వెలవెల.. కార్మికులు విలవిల


