కాంగ్రెస్‌ది గూండారాజ్యం
మైసూరు: అసెంబ్లీ సమావేశాల్లో దళిత వర్గానికి చెందిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డుకుని గూండాల మాదిరిగా ప్రవర్తించారంటూ మైసూరు నగరంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నా జరిపారు. రామస్వామి సర్కిల్‌లో ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రౌడీ కొత్వాల్ శిష్య హరిప్రసాద్, హరిప్రసాద్ హఠావో, కర్ణాటక బచావో అంటూ నినదించారు. రాజ్యాంగ రక్షకులమని నటించే వారు ఈ విధంగా ప్రవర్తించారన్నారు. కాంగ్రెస్ నేతల చర్యలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అండగా నిలిచారన్నారు. కాబట్టి, రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని గూండా ఎమ్మెల్యేలను తొలగించాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్‌కు సీఎం సిద్ధం
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేకెత్తించిన సీఎం కుర్చీ మార్పిడి ఘర్షణ కొంచెం శాంతించినట్లే ఉంది. సీఎం సిద్దరామయ్యే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారనేది స్పష్టమైంది. ఆర్థిక శాఖను చూస్తున్న సిద్దరామయ్య మార్చి 6న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. సీఎం పదవి కోసం పోరాడుతున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఘర్షణ తగ్గిపోయింది. ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం చర్చలు జరిపారు.
ఫిబ్రవరి ఆఖర్లో విస్తరణ?
రాష్ట్ర ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో మంత్రిమండలి విస్తరణ జరగాలని ఎమ్మెల్యేల నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. కుర్చీ పోట్లాట వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాంగ్రెస్ నేతల ప్రకారం ఫిబ్రవరి 22న మంత్రివర్గ విస్తరణ కానీ, ప్రక్షాళన కానీ జరిగే అవకాశముంది.
మంత్రికి వాటా ఇవ్వాల్సిందే
శివాజీనగర: మద్యం అంగళ్లకు లైసెన్స్ ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చిన అబ్కారీ మంత్రి తిమ్మాపుర కేసులో లోకాయుక్త అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలనాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా మంత్రి తిమ్మాపుర పేరును ప్రస్తావించలేదు. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అబ్కారీ డీసీ జగదీశ్ నాయక్, సూపరింటెండెంట్ తమ్మణ్ణ పేర్లతో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయగా, అందులో లైసెన్స్ పొందాలంటే రూ.1.5 కోట్ల లంచం ఇవ్వాలని ఫిర్యాదిదారు వ్యాఖ్యలను పేర్కొన్నారు. అందులో మంత్రికి వాటా ఇవ్వకుంటే ఏ పనీ జరగదని తెలిపారు.


