నారాయణస్వామీ.. ఇక్కడ చూడండి!
శివాజీనగర: సీఎం కుర్చీ విషయంలో ఇన్నాళ్లూ కలహించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సఖ్యత పెరిగినట్లు కన్పిస్తోంది. అల్పాహార విందు సమావేశాల తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది! రెండు వర్గాలకు చెందిన నాయకులు కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం దాదాపు తగ్గించేశారు. అందరూ కలసికట్టుగా సాగాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం కూడా సఖ్యతతో సాగుతున్నట్లు కన్పిస్తోంది. శుక్రవారం బెంగళూరులో కర్ణాటక పరిశ్రమల ప్రాంతీయ అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వేర్వేరుగా విచ్చేశారు. అయితే.. అక్కడ ఒకరి గురించి మరొకరు ఆరా తీయడం ఆసక్తి కల్గించింది. ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండ్య జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన నిర్ణీత సమయానికి కార్యక్రమ వేదికకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో సిద్ధరామయ్య డీసీఎం రావటం లేదా అని అడిగారు. ఆయన కాస్త ఆలస్యంగా వస్తారని, వచ్చేవరకు వేచిచూడాలని పాటిల్ సూచించారు. ఇందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి మండలి కార్యాలయంలో కూర్చొనేందుకు ముందడుగు వేస్తుండగా..సీనియర్ ఎమ్మెల్యే ఆర్‌వీ దేశపాండె కల్పించుకుని డీసీఎం వస్తారు, మీరు ప్రారంభించాలని సలహానిచ్చారు.
ఆయన వచ్చారా?
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మండ్య జిల్లాకు హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉండడంతో డీసీఎం కోసం వేచి ఉంటే సమయం వృథా అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పారు. సమయాభావం కారణంగా ఉప ముఖ్యమంత్రి శివకుమార్ రాకముందే ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు. ఆయన వచ్చీ రాగానే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లారా అని ఆరా తీశారు. అక్కడున్న వారిని పలకరించిన తరువాత డీకే శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కేఐఏడీబీకి నిర్మించిన నూతన కార్యాలయ భవనం పక్కనే ఉన్న ఇంట్లో గతంలో తాను నివసించినట్లు తెలిపారు. తాను అదే ఇంట్లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్నట్లు కూడా తెలియజేశారు. కాగా.. కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వచ్చినా ఒకరి గురించి మరొకరు ఆరా తీయటం ద్వారా ఆత్మీయతను కొనసాగించారు. ఇంతకు ముందు అధికార మార్పిడి కోసం రగడ జరుగుతున్నపుడు ఇటువంటి అన్యోన్యత కనిపించేది కాదు. అల్పాహార సమావేశాల తరువాత ఇద్దరి మధ్య
సంబంధాలు బలోపేతమైనట్లు కనిపిస్తోంది.
బెంగళూరులోని కొడిగేహళ్లిలో నమ్మమెట్రో పనులను
శుక్రవారం పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కర్ణాటక పరిశ్రమల ప్రాంతీయ అభివృద్ధి మండలి భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం సిద్దరామయ్య, చిత్ర ంలో మంత్రులు ఎంబీ పాటిల్, చెలువరాయస్వామి
ఒకరి రాక గురించి మరొకరు ఆరా
కేఐఏడీబీ భవన ప్రారంభోత్సవంలో
ఆసక్తికర సన్నివేశాలు
చలవాదికి డీకే కౌంటర్
బనశంకరి: కార్టియర్ వాచ్‌ను అఫిడవిట్‌లో డీకే శివకుమార్ పొందుపరచలేదని ఆరోపించిన విధాన పరిషత్ విపక్ష నేత చలవాది నారాయణస్వామికి డీసీఎం డీకే శివకుమార్ శుక్రవారం ఎక్స్ ఖాతాలో గట్టిగా బదులిచ్చారు. లోకాయుక్తకు తాను అందించిన అఫిడవిట్ కాపీని డీసీఎం పోస్ట్ చేశారు. ‘మిస్టర్ నారాయణస్వామీ.. ఇక్కడ చూడండి. లోకాయుక్తకు నేను అందజేసిన అఫిడవిట్ ఇది. జవాబుదారీ స్థానంలో ఉన్న మీరు నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పరాదు. ఇది తగదు. నేను పారదర్శకమైన వ్యక్తిని. ఏమీ దాచిపెట్టరాదని నిజం చెప్పాను. నాకు ఇష్టమైన వాచీ ధరించడానికి యోగ్యత లేదా? హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ‘మీకు ఉన్న రాజ్యాంగ అధికారం, జవాబుదారీతనం సక్రమంగా నిర్వహించండి. అవివేకంగా వ్యవహరించవద్దు. అవసరమైతే లోకాయుక్త కార్యాలయానికి వెళ్లి తన అఫిడవిట్ చూసుకోవాల’ని డీకే శివకుమార్ దీటుగా బదులిచ్చారు.
ఢిల్లీలోనే మకాం వేసిన యడ్డి
శివాజీనగర: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి బీజేపీలో అసమ్మతి నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌ను కలసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హస్తినకు వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలో మూడు రోజులుగా మకాం వేసిన అసమ్మతి నాయకులు బీజేపీ హైకమాండ్‌ను భేటీ అయ్యి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారిని నియమించాలని ఒత్తిడి చేశారు. దీంతో తన కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను కొనసాగించేలా యడియూరప్ప ప్రయత్నాలు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్‌ను కలసి వాస్తవ పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళతారని తెలిసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా విజయేంద్ర రెండేళ్లుగా సమర్థవంతంగా పని చేస్తూ పార్టీని సంఘటితం చేసేందుకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టారో యడియూరప్ప వివరించి.. విజయేంద్రనే రాష్ట్రాధ్యక్షుడిగా కొనసాగించేలా డిమాండ్ చేయనున్నారని సమాచారం.
నారాయణస్వామీ.. ఇక్కడ చూడండి!


