విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా 102 ఇండిగో విమానాలను రద్దు చేయగా ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఇండిగో విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న వందలాది మంది ఎయిర్‌పోర్టుకు చేరుకోగా హఠాత్తుగా విమానాలు రద్దు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటంచడంతో ప్రయాణికులు దిక్కుతోచక అక్కడే 12 గంటలపాటు వేచి చూశారు. రద్దయిన విమానాల్లో 52 రావాల్సినవి ఉండగా మరో 50 ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వెళ్లాల్సినవి ఉన్నాయి. ఓపిక నశించిన ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఉద్యాననగరిలో చిరు జల్లులు
● పలు జిల్లాల్లో మంచు వాతావరణం
బనశంకరి: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండగా, మరికొన్ని చోట్ల మంచు, మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. రాజధాని బెంగళూరు నగరంలో శుక్రవారం ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తూ మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. బెంగళూరు నగరంలోని మల్లేశ్వరం, మెజెస్టిక్, శాంతినగర, యశవంతపుర, ఆర్‌ఆర్.నగర, కెంగేరి, గిరినగర, హొసకెరెహళ్లి, ఉత్తరహళ్లి, విజయనగర, జయనగర, బనశంకరి, మైసూరు రోడ్డు, జేపీ నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురిసింది. అంతేగాక చలి తీవ్రత అధికంగా ఉంది. మండ్య, రామనగర, మైసూరు జిల్లాల్లో దట్టమైన మంచు, చలితో కూడిన వాతావరణం నెలకొంది. ఉడుపి, దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది. బెళగావి, బీదర్, విజయపుర, బాగల్‌కోటె, హావేరి, గదగ, ధార్వాడ, కలబుర్గి, కొప్పళ, రాయచూరు, యాదగిరి, బళ్లారి, విజయనగర జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్లాపుర, దావణగెరె, తుమకూరు జిల్లాల్లో సాధారణ వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది.
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం గాలింపు
దొడ్డబళ్లాపురం: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ కోసం ఆ రాష్ట్ర పోలీసులు బెంగళూరులో గాలింపు చేపట్టారు. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడి గర్భిణి చేసి అనంతరంఅబార్షన్ చేయించాడు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈయన బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వచ్చి గాలింపు చేపట్టారు. రాహుల్‌ను కేరళ నుండి బెంగళూరుకు తీసుకువచ్చిన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
మెట్రో రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
శివాజీనగర: నమ్మ మెట్రో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన శుక్రవారం బెంగళూరులోని కెంగేరీ వద్ద జరిగింది. ఈ ఘటనతో నేరేడు మార్గంలో మెట్రో సంచారానికి కొంతసేపు అంతరాయం ఏర్పడింది. డీసీపీ అనితా హద్దణ్ణవర్ తెలిపినమేరకు.. విజయపుర జిల్లా దేవరహిప్పరగి సమృద్ధి నగరకు చెందిన శాంతనగౌడ పాటిల్ (38) శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కెంగేరి నమ్మ మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. 8.15 గంటల సమయంలో రైలు వస్తుండగా పట్టాలపైకి దూకాడు. అతనిపై రైలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని రాజరాజేశ్వరినగర ఆసుపత్రి శవాగారానికి తరలించారు. ఈ ఘటనతో మైసూరు రోడ్డు చల్లఘట్ట మధ్య మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లను వైట్‌ఫీల్డ్ నుంచి మైసూరు రోడ్డు వరకు మాత్రం నడిపించారు. మృతదేహాన్ని తరలించిన అనంతరం రైళ్ల సంచారం కొనసాగింది. కాగా శాంతనగౌడ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియరాలేదు.
విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు
విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు
విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు


