సీఎం, విపక్షనేత ‘సోషల్ వార్’
బనశంకరి: కర్ణాటకలో అవినీతి విషయంపై డిప్యూటీ లోకాయుక్త వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌పై విపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. 40 శాతం కమీషన్ అని బీజేపీ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు, అసత్యప్రచారం చేసి కన్నడిగులను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పూర్తిగా కమీషన్ దందాలో మునిగిపోయిందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనికి సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇవ్వగా.. విపక్ష నేత ఆర్.అశోక్ కూడా ప్రతికౌంటర్ ఇచ్చారు. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇండియా ఇంటర్నేషనల్ 2019 నవంబరులో ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో 63 శాతం అవినీతి ఉంది. అదే నివేదిక ఆధారంగా డిప్యూటీ లోకాయుక్త బీ.వీరప్ప మాట్లాడారు. ఈ నివేదిక బయటికి వచ్చిన సమయంలో రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్.అశోక్ ఉపలోకాయుక్త వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా బీజేపీ పాపం మా తలపై రుద్దడానికి ప్రయత్నించి వారే బోల్తా పడ్డార’ని సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై విపక్షనేత ఆర్.అశోక్ కౌంటర్ ఇచ్చారు. ‘ముందుగా లోకాయుక్త నివేదిక అబద్ధమని చెప్పి ప్రస్తుతం ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక అని చెప్పడం సంతోషదాయకం. డిప్యూటీ లోకాయుక్త బీ.వీరప్ప ప్రస్తావించిన నివేదిక 2019 నవంబరులో విడుదలైంది. అంటే 2018 అవినీతి గురించి జరిపిన సమీక్ష. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నది మీరే. దీంతో ఈ నివేదికను బీజేపీకి ముడిపెట్టే బదులు మీ హయాంలో 63 శాతం ప్రజలు ఎందుకు లంచం ఇచ్చారనేది మీరు వివరించాలి. మీ అధినేత రాహుల్‌గాంధీ మూర్ఖత్వాన్ని దేశం క్షమించవచ్చు. కానీ కర్ణాటక ప్రజలు రాష్ట్ర చరిత్రలో అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని క్షమించరు. ఏటేటా కర్ణాటక అవినీతి జాబితాలో అగ్రస్థానంలో ఉండడానికి కారణం ఏమిటనే దానిపై సమాధానం ఇవ్వాల’ని ఆర్.అశోక్ డిమాండ్ చేశారు.
నా వ్యాఖ్యలు
తప్పుగా అర్థం చేసుకున్నారు–వీరప్ప
అవినీతి విషయంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప బెంగళూరులో తెలిపారు. హైకోర్టు సభాభవనంలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉండే అవినీతి గురించి తాను మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. దేశంలో గతంలో నుంచి ఉన్న అవినీతి గురించే తాను తెలిపానన్నారు. ఏ ప్రభుత్వం, పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు అవినీతికి కారణమయ్యాయన్నారు. స్వార్థం కోసం తన వ్యాఖ్యలను వాడుకోవడం సరికాదని హితవు పలికారు.


