కుటుంబ కలహాలతో వైద్యురాలు, కుమారుడు ఆత్మహత్య
శివమొగ్గ : కుటుంబ కలహాలతో వైద్యురాలు, ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శివమొగ్గ నగరంలోని ఆశ్వత్ నగర 5వ క్రాస్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. శివమొగ్గ నగరంలోని హేమరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ జయశ్రీ(55) గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు ఆకాశ్(35) భార్య ఇదే ఇంటిలో ఏడాది క్రితంఆత్మహత్య చేసుకుంది. ఈ యేడాది మే నెలలో ఆకాశ్ మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి తల్లీకుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఇద్దరు గొడవ పడ్డారు. కుమారుడు పై అంతస్తులోని గదిలో పడుకోగా, తల్లి కింద గదిలో పడుకుంది. ఆకాశ్ భార్య మరో గదిలో పడుకుంది. శుక్రవారం ఉదయం ఆకాశ్ భార్య నిద్ర లేచి చూడగా ఇద్దరూ బయటికి రాలేదు. వెళ్లి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగు చూసింది. వినోభనగర పోలీసులు వచ్చి పరిశీలించగా జయశ్రీ గదిలో డెత్‌నోట్ లభించినట్లు తెలిసింది. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


