వైభవంగా దత్త జయంతి
యశవంతపుర: దత్త జయంతి కార్యక్రమం వైభవంగా ముగిసింది. వేల సంఖ్యలో భక్తులు దత్తమాలను ధరించి దత్తపీఠాన్ని దర్శించుకున్నారు. చివరి రోజు కావడంతో శ్రీగురు దత్తాత్రేయ బాబాబుడన్‌స్వామి దర్గాకు ఉదయం నుంచి మాలధారులు బారులు తీరారు. గుహ ముందుభాగంలో దత్తజయంతి హోమాన్ని నిర్వహించారు. రుద్రహోమం, దత్తధారక హోమం, గుహ లోపల దత్తపాదుకలకు రుద్రాభిషేక పూజలు చేశారు. దక్షిణకన్నడ, ఉడుపి, పుత్తూరు, హాసన, శివమొగ్గ, బెంగళూరు, తుమకూరుతో పాటు రాష్ట్రం నలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు దత్తపీఠానికి చేరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్లు, మినీ బస్సులు, జీపులతో దత్తపీఠం నిండిపోయింది. కడూరు అసెంబ్లీ క్షేత్రం నుంచి అధిక సంఖ్యలో వాహనాల్లో భక్తులు వెళ్లి దత్తాపాదుకలను దర్శించుకున్నారు. హొన్నమ్మన గుంతలో భక్తులు స్థానం చేసి కాలినడకన దత్తపీఠం చేరుకున్నారు. విశ్వేంద్రభట్ నేతృత్వంలో సచిన్, కృష్ణభట్, ఉదయ్ శంకర్ భట్, సుమంత్ నెమ్మార్ బృందం కళా హోమం, దత్తహోమాలను నిర్వహించారు. శంకరదేవుడి మఠం చంద్రశేఖర్‌స్వామి, సర్వధర్మ పీఠం జయబసవానందస్వామి, కడూరు తాలూకా యళనాడు మహా సంస్థానం జ్ఞానప్రభ సిద్ధరామ దేశికేంద్రం స్వామి, రంభాపురి బీరూరు శాఖమఠం రుద్రముని శివాచార్య స్వామి, ఎమ్మెల్సీ సీటీ రవి, దీపక్ దొడ్డయ్య, శ్రీరామసేన సంస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్, జిల్లా కలెక్టర్ మీనా నాగరాజు, సీఈఓ హెచ్‌ఎస్ కిత్తనా, దత్తపీఠం వ్యవస్థాపక సమితి పాలనాధికారి నారాయణ కనకరెడ్డిలు పాల్గొన్నారు.


