బళ్లారిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం
సాక్షి బళ్లారి: నగరంలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. రాయల్ సర్కిల్, బసవేశ్వర నగర్ కాలనీలోని ప్రధాన రహదారి, కోలాచలం కాంపౌండ్ రోడ్డు, ఎస్వీ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఆరు నెలల క్రితం అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఓ వైపు అభివృద్ధి పనులు ఊపందుకున్నా.. ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు వేయడానికి సంబంధిత యంత్రాలతో రోడ్లు తవ్వడం, తదితర చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అభివృద్ది పనులు చేపట్టడం మంచిదే.. కానీ ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.


