 
															పరిహారం మహోప్రభో
శివాజీనగర: అత్యాచారం, లైంగిక వేధింపులు, అమాయకుల హత్య, యాసిడ్ దాడులు, ఇతరత్రా తీవ్ర నేరాలకు గురైన బాధితులు ప్రభుత్వం నుంచి సహాయం అందక కుమిలిపోతున్నారు. వీరికి, బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహార సొమ్ము మంజూరు చేయాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. పై నేరాల్లో బాధిత మహిళలకు, బాలికలకు కర్ణాటక బాధిత పరిహార పథకం–2011 కింద న్యాయ సేవల ప్రాధికార ద్వారా పరిహారం అందుతోంది.
982 మంది నిరీక్షణ
లైంగిక దాడులే కాకుండా, వర్గపోరు గొడవల్లో మృతులకు గరిష్ఠంగా రూ.10 లక్షలు, ఇతర గొడవల్లో 80 శాతం అంగవైకల్యం అయినవారికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని రెండేళ్ల కిందట జత చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలకు గరిష్టంగా రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సవరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది, అందులో 276 మంది బాధితులకు సొమ్ము ఇచ్చారు, ఇది చాలా తక్కువే. గత 3 సంవత్సరాల్లో బకాయిపడిన 982 మంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి రూ.35.61 కోట్లు అవసరముంది. అందుచేత ఈ సొమ్మును మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రాధికార కోరుతోంది.
పోక్సో కేసులే ఎక్కువ
రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 3 సంవత్సరాల్లో 13,719 పోక్సో కేసులు రావడం బాలలపై పెరుగుతోన్న లైంగిక హింసకు అద్దం పడుతోంది. ఇందులో 80 శాతం కేసుల్లో బాలికల బంధువులు, పరిచయస్తులే నిందితులుగా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఫిర్యాదు చేసేవారి సంఖ్య అధికమైందని ప్రాధికార అధికారి ఒకరు తెలిపారు. అందువల్ల కేసులు పెరిగి, పరిహార మొత్తం కూడా ఎక్కువవుతోందని చెప్పారు. 2023కు ముందు సంవత్సరానికి సుమారు 300 కేసులు పరిష్కారమై ప్రాధికారకు పరిహారం కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 2 సంవత్సరాల్లో ఈ సంఖ్య 3 రెట్లు పెరిగింది. గత నెలాఖరుకు 650 కు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. సర్కారు ఏటా రూ.10 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇది చాలడం లేదు, అందుకే మరిన్ని నిధులు కావాలని సర్కారుకు నివేదికను పంపినట్లు చెప్పారు.
పురుషులకూ లభిస్తుంది
మహిళలకే కాదు, పురుషులకు కూడా పరిహారం లభిస్తుంది. అమాయకులు దాడుల్లో అంగ వైకల్యానికి, హత్యకు గురైతే కుటుంబీకులు పరిహారం పొందవచ్చు. వయసును బట్టి పరిహార మొత్తం ఉంటుంది. మృతులు 40 సంవత్సరాలు పైబడినవారైతే రూ.3 లక్షలు ఇస్తారు. వయసు పెరిగే కొద్దీ పరిహారం తగ్గుతుంది. యాసిడ్ దాడికి గురైతే రూ.3 లక్షల సాయం లభిస్తుంది.
కొండలా బకాయిలు
ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రూ.46.75 కోట్లను విడుదల చేసింది. అంటే ఏటా రూ.10 కోట్ల కంటే తక్కువే. కొండలా బకాయిలు ఉండడంతో రూ.35 కోట్ల నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రాధికార లేఖ రాసింది. పరిహారం కోసం బాధితులు,వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాధికార మీద ఒత్తిడి పెరుగుతోంది. నిధులు వచ్చిన తక్షణమే 982 కేసుల్లో పరిహారం అందజేస్తామని న్యాయ సేవల ప్రాధికార కార్యదర్శి హెచ్.శశిధర్‌శెట్టి తెలిపారు.
లైంగికదాడులు, వేధింపుల బాధితుల మొర
అరకొరగానే సాయం పంపిణీ
వేలాదిమంది ఎదురుచూపులు
రూ.35 కోట్లు కావాలని సర్కారుకు
న్యాయ సేవల ప్రాధికార నివేదిక
 
							పరిహారం మహోప్రభో
 
							పరిహారం మహోప్రభో
 
							పరిహారం మహోప్రభో

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
