 
													ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా దుండగుల దాడి
ప్రాణాలతో బయటపడిన బాధితుడు
నంజనగూడులో నలుగురు అరెస్టు
మైసూరు: దోపిడీ సన్నివేశాన్ని సృష్టించి భర్తను హత్య చేయడానికి స్కెచ్ వేసిన భార్య, మరో ముగ్గురి ఉదంతం మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది. ఓ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ సంగీత, ఈమె సోదరుడు సంజయ్, ఇతని స్నేహితుడు విఘ్నేష్, మరో మైనర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.
కారులో వచ్చి అడ్డగించి..
వివరాలు.. సంగీత భర్త రాజేంద్ర, ఇతడు ఇళ్లకు ఫైబర్ తలుపులను అమర్చే పని చేసేవాడు, భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట రాజేంద్ర భార్యను స్కూటర్‌లో హుండివినకెరె లేఔట్‌లో ఉన్న ముడా లేఔట్ వద్దకు వెళ్తుండగా ఓ తెల్ల కారు వారిని అడ్డగించింది. కారులోని వ్యక్తి రాజేంద్ర, సంగీతలను కిందపడేసి గొడవకు దిగారు. మరో ఇద్దరు సంగీత మెడలో ఉన్న బంగారం చైన్‌ను లాక్కోబోయారు. అలాగే పెద్ద కత్తితో రాజేంద్రపైన దాడి చేశారు. 
ఇంతలో మరో వాహనం రావడంతో దుండుగులు భయపడి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ఫిర్యాదు మేరకు నంజనగూడు పోలీసులు విచారణ చేపట్టారు. పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. సంగీతనే తమను హత్య చేయాలని పురమాయించిందని విచారణలో నోరు విప్పారు. దీంతో నిందితులతో పాటు సంగీతని అరెస్టు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
