మెట్రో రైళ్లకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

మెట్రో రైళ్లకు అంతరాయం

Oct 31 2025 8:00 AM | Updated on Oct 31 2025 8:00 AM

మెట్ర

మెట్రో రైళ్లకు అంతరాయం

వేలాది ప్రయాణికుల సతమతం

పర్పుల్‌, గ్రీన్‌ లైన్లలో సాంకేతిక లోపాలు

శివాజీనగర: బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థలో పలు రైళ్లు నిలిచిపోయి తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పర్సుల్‌ లైన్‌ (నేరేడు మార్గం) లో విజయనగర– హొసహళ్లి మార్గంలో దీపాంజలి నగర మెట్రో స్టేషన్‌లో ఓ రైలు సుమారు 40 నిమిషాల పాటు మొరాయించింది. దీనివల్ల ఇటు చల్లఘట్ట నుంచి అటు వైట్‌ఫీల్డ్‌ వరకు ఈ మార్గంలోని ఇతర స్టేషన్ల నుంచి వచ్చి పోయే రైళ్లకు ఇబ్బంది ఏర్పడి గొలుసుకట్టు సమస్య నెలకొంది.

ఎక్కడెక్కడ అంతరాయం..

విజయనగర– హొసహళ్ళి నేరేడు మార్గంలో ఉదయం 9.15 గంటలకు ఓ రైలు ఉన్నపళంగా నిలిచిపోయింది. దీంతో మెజిస్టిక్‌, చల్లఘట్ట మధ్య నేరేడు మార్గంలో రైలు సేవలు మొత్తం స్తంభించాయి. గ్రీన్‌ మార్గంలో కూడా రైళ్లను తగ్గించారు. కొన్ని గంటలపాటు రైళ్లు ఎందుకు నిలిచిపోయాయో, ఎలా గమ్యం చేరాలో తెలియక వేలాది ప్రయాణికులు దిక్కులు చూశారు. తాము గంటల కొద్దీ స్టేషన్లలోనే చిక్కుకున్నట్లు సోషల్‌ మీడియాలో ఆక్రోశం వ్యక్తంచేశారు. నేరేడు మార్గంలో మైసూరు రోడ్డు వరకు ఉదయం 10.15 నుంచి సర్వీసులను పునరుద్ధరించారు.

ప్రయాణికుల ఆవేదన

కాడుగోడికి వెళ్తుండగా సడన్‌గా మా రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఓ అర్ధగంట తరువాత రైలును విజయనగర స్టేషన్‌కు మళ్లించారు, మమ్మల్ని దిగిపోవాలని సిబ్బంది ఆదేశించారు, ఎందుకిలా చేశారో తెలియదు అని అనేకమంది ప్రయాణికులు సోషల్‌ మీడియాలో ఆరోపించారు. ఏం జరుగుతోందో మాకు చెప్పలేదు, చాలామంది భయాందోళనలకు గురయ్యమని తెలిపారు. కబ్బన్‌ పార్క్‌ నుంచి ఎంజీ రోడ్డు మధ్యలో ఓ రైలు నిలిచిపోయింది, 40 నిమిషాలు రైల్లోనే ఇరుక్కుపోయాం అని ఓ ప్రయాణికుడు ఎక్స్‌లో తెలిపాడు.

మరో రైలు..

కొన్ని నిమిషాల తేడాలో విజయనగర స్టేషన్‌లో కూడా మరో రైలు యాంత్రిక లోపంలో నిలిచిపోయింది. అర్ధగంట అయినా కూడా సమస్యలను మెట్రో సిబ్బంది పరిష్కరించలేకపోయారు. ఉదయం పీక్‌ అవర్‌లో వేలాది ప్రయాణికులు స్టేషన్‌లలోనే వేచిచూస్తూ అవస్థలుపడ్డారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు తెలిపారు.

మెట్రో రైళ్లకు అంతరాయం 1
1/1

మెట్రో రైళ్లకు అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement