 
															కన్నకూతురిలా చూసుకుని కోట్ల ఆస్తిని రాసిస్తే..
శివాజీనగర: కేర్ టేకర్‌గా వచ్చినామెకు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి రాసిచ్చి కన్న కూతురులా చూసుకున్నా కూడా యజమాని ఇంటికి కన్నం వేసిన యువతి కటకటాలు లెక్కిస్తోంది. మంగళ (32) అరెస్ట్ అయిన నిందితురాలు. జల్సాలు, ప్రియుడు, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మోజులో పడి పనిచేసే ఇంటిలో బంగారు నగలను కాజేసింది. బెంగళూరు జే.పీ.నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
వివరాలు.. జేపీ నగర రెండో స్టేజ్‌లో నివాసమున్న ఆశా జాదవ్ అనే మహిళ తమ తల్లిని చూసుకోవటానికి 15 సంవత్సరాల క్రితం మంగళ అనే యువతిని నియమించుకుంది.
రూ.కోట్ల ఇళ్లు మంగళ పేరిట
జే.పీ.నగరలో కోట్లాది ఆస్తులు కలిగిన ఆశా జాదవ్, మంగళను స్వంత కుమార్తెలా చూసుకునేవారు. అంతేకాకుండా ఒకటిన్నర కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లును మంగళా పేరుకు రాసిచ్చారు. త్వరలో పెళ్లి చేయాలని కూడా అనుకుంది. కానీ మంగళ పెడతోవ పట్టింది, ప్రియునితో కలిసి జల్సాలు చేసేది, పబ్‌లకు వెళ్లేది, ఇలా రూ.40 లక్షల వరకూ అప్పులు చేసినట్లు చెప్పడంతో ఆశా జాదవ్ పెద్దమనసుతో చెల్లించింది. అంతేకాకుండగా రూ. 5 కోట్ల విలువ చేసే నివాసమున్న ఇంటిని కూడా మంగళ కు రాసిచ్చింది. జల్సాల కోసం మొదట రాసిచ్చిన ఇంటిని మంగళ అమ్మేసింది. ఇటీవల ఆశాకు చెందిన 450 గ్రాముల బంగారం, 3 కే.జీల వెండిని చోరీ చేసింది. ఎవరో దొంగలు చేసి ఉంటారని ఆశా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ సాగించారు. చివరకు మంగళను అరెస్టు చేసి ఆ బంగారం, వెండిని స్వాధీనం చేసుకొన్నారు. నిందితురాలిని జైలుకు తరలించారు.
పనిచేసే ఇంటిలోనే బంగారం చోరీ
నిందితురాలు మంగళకు కటకటాలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
