ఏనుగు దాడిలో అన్నదమ్ముల మృతి
యశవంతపుర: ఏనుగుల దాడిలో అన్నదమ్ములు మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా కెరెమనె గ్రామంలోని కుదురెముఖ జాతీయ ఉద్యానవనం పరిధిలో జరిగింది. గ్రామానికి చెందిన అన్నదమ్ములు హరీశ్(44), ఉమేశ్(40)లు గురువరం పశువుల మేత తేవటానికి పొలం వద్దకు వెళ్లారు. ఏనుగులు దాడి చేసి ఇద్దరిని కాళ్లతో తొక్కేశాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఘటన స్థలాన్ని శృంగేరి పోలీసులు, అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కాగా మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన శృంగేరి తహసీల్దార్ కారును అడ్డగించి స్థానిక రైతులు అందోళన చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయమైన పరిహరం ఇచ్చి అదుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటీ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులతో చర్చించి పరిహారం అందజేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాగా పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


