పీడీఓ సస్పెన్షన్ ఎత్తివేత
రాయచూరు రూరల్: రాష్ట్రీయ స్వయం సేవక్ పథ సంచలనంలో పాల్గొన్నారనే కారణంతో లింగ సూగురు తాలుకా రోడలబండ పీడీఓ పంచాయతీ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఏకపక్ష నిర్ణయాలతో పీడీఓను సస్పెండ్ చేయడాన్ని మైసూరు ఎంపీ తేజస్వి సూర్య ఖండించారు. కర్నాటక పరిపాలన ట్రిబ్యూనల్‌లో పిటీషన్ వేశారు. విచారణ చేపట్టిన కేఏటీ ప్రవీణ్ కుమార్‌ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజ్యోత్సవ అవార్డుల
ప్రకటనపై హర్షం
హుబ్లీ: ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 70 మందికి రాజ్యోత్సవ అవార్డులు ప్రకటించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీరంగ ఆల్ రౌండర్‌గా ఎదిగిన ప్రకాష్ రాజ్‌కు అవార్డు రావడంపై జిల్లా ప్రముఖులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులకు రాజ్యోత్సవ ప్రశక్తులను ప్రకటించారు. కొప్పళ జానపద కళాకారుడు బసవప్ప బరమప్ప చౌడి, అలాగే బెళగావి సన్నింగప్ప సత్తప్ప ముసేన్నగోళ, చిత్రదుర్గ హనుమంతప్ప మారెప్ప, విజయపుర సోమన్న దుండప్పకు జానపద రంగానికి సంబంధించి అవార్డులు ప్రకటించారు. ఇక సంగీత రంగంలో కృషి చేసిన కోప్పళ దేవేంద్ర కుమార్ పత్తార్, బీదర్ మడివాళయ్య సాలికి అవార్డులు ప్రకటించారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి
హొసపేటె: పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మరింత పెంచాలని టీబీ డ్యాం ప్రభుత్వ పీయూ కాలేజీ ఉపాధ్యాయురాలు, సముదాయదత్త వీక్షకరాలు శ్రీలత తెలిపారు. గురువారం టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సముదాయ దత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెంచేందుకు నిరంతరంగా శ్రమించాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, రవి, హేమలత, మంజుల, శారద పాల్గొన్నారు.
నేడు గురుపాదేశ్వరుడి పుణ్యారాధన
రాయచూరు రూరల్: నగరంలోని కిల్లే బ్రహన్మఠంలో శుక్రవారం గురుపాదేశ్వరుడి పుణ్యారాధన కార్యక్రమం చేపట్టనున్నారు. మఠాధిపతి శాంతమల్ల శివాచార్య ఆధ్వర్యంలో గురుపాదేశ్వర మూల విరాట్‌కు అభిషేకం,పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరాధనలో భాళే హోన్నురు రంబాపుర పీఠాధిపతి జగుద్గరు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజ దేశీ కేంద్ర శివాచార్యులు పాల్గొంటారన్నారు.
పులి దాడిలో
యువకుడికి గాయాలు
రాయచూరు రూరల్: పులి దాడిలో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చిక్క హెసరూరు–పామన కల్లూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. వివరాలు.. పామన కల్లూరుకు గ్రామానికి చెందిన యువకుడు రవికుమార్ పత్తి పొలంలో పత్తి విడిపించేందుకు వెళ్లాడు. యువకుడు పని చేస్తుండగా ఒక్కసారిగా పులి దాడి చేసింది. గాయపడిన రవికుమార్ వెంటనే చెట్టుపైకి ఎక్కి కూర్చొన్నాడు. అయితే అక్కడి నుంచి కిందపడటంతో గాయాలయ్యాయి. ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయపడిన యువకుడిని చికిత్సల నిమిత్తం లింగసూగురు ఆస్పత్రికి తరలించారు.
బొలెరో బోల్తా
రాయచూరు రూరల్: పత్తి లోడుతో బయలుదేరిన బొలెరో పొలం గట్టు దాటే క్రమంలో బోల్తా పడింది. గురువారం రాయచూరు తాలుకా గారలదిన్నిలో జరిగిన ఘటనలో డ్రైవర్ నరసింహ (33) గాయాలపాలయ్యాడు. పొలం గట్టు ఎక్కే క్రమంలో బొలెరో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
పీడీఓ సస్పెన్షన్ ఎత్తివేత
పీడీఓ సస్పెన్షన్ ఎత్తివేత


