
రియల్టర్‌కు కత్తిపోట్లు
మైసూరు: రియల్టర్‌ని రౌడీ ముఠా చాకుతో పొడిచిన ఘటన మైసూరులోని విజయనగర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గురుప్రసాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. రియల్టర్ గురుప్రసాద్ ఒక బార్‌కు వెళ్లారు. అక్కడే రౌడీషీటర్ కౌశిక్ కూడా ఉన్నాడు. గురుప్రసాద్ బిల్లు కట్టే సమయంలో, కౌశిక్ వెళ్లి తన బిల్లును కూడా నువ్వే కట్టాలని అతనిని ఒత్తిడి చేశాడు. బిల్లు కట్టకపోతే, నీ అంతు చూస్తా అని గదమాయించాడు. గురుప్రసాద్ బార్ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ సాయంత్రం తన సోదరుడు కరుణాకర్‌తో కలిసి అదే బార్‌లోకి వెళ్లగా కౌశిక్ ఎదురు పడ్డాడు. మధ్యాహ్నం నా బిల్లు కట్టకుండా పారిపోయింది వీడే అంటూ ఎగతాళి చేస్తూ గొడవకు దిగాడు. భయపడిన వారిద్దరూ బయటకు పరుగులు తీయగా కౌశిక్, అతని అనుచరులు వెంటాడి గురుప్రసాద్‌ను ఇష్టానుసారం చాకుతో పొడిచారు. కాగా, కౌశిక్, దేవరాజ్, మరో ముగ్గురిపై విజయనగర పోలీసులు కేసు నమోదు చేశారు.
కనువిందుగా పండుగ
పావగడ: తాలూకాలోని తండాల్లో దీపావళిని ఉత్సాహంగా జరిపారు. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అలరించారు. బుధవారం పెద్దల పండుగను జరుపుకున్నారు. ఐదలమ్మ గుడి వద్ద ముగ్గులు వేసి తంగేడు పూలతో పూజలు చేశారు. సేవాలాల్ దేవాలయంలో దీపాలు వెలిగించి పూజలు చేశారు.
పాఠశాలలో దండన..
ఆస్పత్రిపాలైన బాలుడు
శివాజీనగర: 2 రోజులు పాఠశాలకు రానందుకు ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు దాడి చేశారు. వివరాలు.. బెంగళూరులోని సుంకదకట్టె, పైప్‌లైన్ రోడ్డులో ఉన్న సెయింట్ మేరీస్ పబ్లిక్ పాఠశాలలో 5వ తరగతి బాలుడు గైర్హాజరు కావడంతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అతనిని తీవ్ర స్థాయిలో దండించారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత బాలుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తుండగా, తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో స్కూలు నిర్వాహకులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో, తమకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బాలల హక్కుల భద్రతా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వారం రోజుల్లో పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించింది.