
మాదప్ప సన్నిధిలో దీపావళి పూజలు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలెమహదేశ్వర బెట్టలోని మాదప్ప సన్నిధిలో దీపావళి మహోత్సవం సంబరంగా జరిగింది. మాదప్పకు తైలమజ్జన సేవలు గావించారు. లింగమూర్తికి నువ్వుల నూనె, కొబ్బరినీళ్లు, తేనె, పెరుగు, చక్కెర, కర్జూరం, ద్రాక్షలతో పాటు పాలాభిషేకం, సహస్ర బిల్వార్చన నెరవేర్చారు. అనంతరం మాదప్ప మూర్తిని వివిధ రకాల పూలతో అలంకరించారు. ధూప, దీప హారతి, మహామంగళ హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బెట్టపై విడిది చేసిన లక్షలాది మంది భక్తులు తమ కోర్కెలతో వివిధ రకాల సేవలను చేసి పునీతులయ్యారు. బెట్ట విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోయింది.
నేను కన్నడిగురాలినే
= కిరణ్ మజుందార్ షా
శివాజీనగర: బెంగళూరులో రోడ్లు, సౌకర్యాలు సరిగా లేవని విమర్శలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా ఆ తరువాత సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి వివరణ ఇచ్చారు. బెంగళూరుని ఆమె విమర్శించడంపై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. నేను గుజరాతీ కాదు, కన్నడిగురాలు అని జనం కోపాన్ని చల్లార్చే యత్నం చేశారు. నేను బెంగళూరులో పుట్టాను, బెంగళూరు, కన్నడ సంస్కృతిని ప్రేమిస్తూ ఏడు దశబ్దాలను ఇక్కడే గడిపాను. కన్నడ అద్భుతమైన భాష, రాయడం, మాట్లాడడం వస్తుంది. నా మమకారాన్ని ప్రశ్నించేవారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను గర్వంగా చెప్పుకునే కన్నడిగురాలు అని పోస్టులో పేర్కొన్నారు.