
చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్‌కు బ్రేక్
శివాజీనగర: కల్బుర్గి జిల్లా చిత్తాపురలో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనం జరగరాదని అక్కడి ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రియాంక్ ఖర్గే, జరిపి తీరాలని సంఘ్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ జాతాకు అనుమతి ఇవ్వలేదని చిత్తాపుర తహసీల్దారు ప్రకటించడంపై సంఘ్ పెద్దలు భగ్గుమన్నారు. ఆదేశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసును దాఖలు చేశారు. ఆదివారం అయినప్పటికీ హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది.
తహసీల్దారు నిరాకరణ
చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనం జరిపేందుకు తీర్మానించింది. ఇదే సమయంలో భీమ్ ఆర్మీ అనే దళిత సంఘం కూడా కవాతు జరపాలని నిర్ణయించింది. ఇలా ఒకే సమయంలో రెండు సంఘాలు ర్యాలీల వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని చిత్తాపుర తహశీల్దార్ నాగయ్య ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతిని నిరాకరించారు. దీనిని అశోక్ పాటిల్ అనే సంఘ్ నేత హైకోర్టు కల్బుర్గి ధర్మాసనంలో పిటిషన్ వేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు సూచనలు
పిటిషన్‌దారుల విన్నపాన్ని తిరస్కరించేందుకు తగిన చట్టం లేదని జడ్జి పేర్కొన్నారు. ఈసారి దరఖాస్తులో పథసంచలనం మార్గం, స్థలం, సమయం వివరాలు ఉండాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అనుమతికి సంబంధించిన నివేదికను 24న తమకు సమర్పించాలని జడ్జి ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. చిత్తాపుర ర్యాలీకి అనుమతి ఇవ్వాలనగా మొదట్లోనే జడ్జి నిరాకరించారు. తేదీ మార్పు కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. చిత్తాపురలో ఓ రకంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు నిరాశే మిగిలింది.
ర్యాలీకి తహసీల్దారు తిరస్కృతి
హైకోర్టులో ఆర్‌ఎస్‌ఎస్ పిటిషన్
తక్షణ అనుమతికి జడ్జి నిరాకరణ
అనుమతి ఉంటే నవంబరు 2న
జరపవచ్చని ఆదేశం
24కు కేసు వాయిదా
ముఖభంగం కాదు: మంత్రి ఖర్గే
ఈ కేసులో తనకు ఎలాంటి ముఖభంగం కాలేదని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. బెంగళూరులో నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ర్యాలీ జరపాలనుకుంటే ఆర్‌ఎస్‌ఎ జిల్లా యంత్రాంగానికి పిటిషన్‌ను సమర్పించాలని జడ్జి ఆదేశించారని తెలిపారు. బీజేపీ నేతలు సొంత తెలివితో విమర్శలు చేస్తున్నారని హేళన చేశారు. కోర్టు ఏకాఎకిన అనుమతి ఇచ్చి ఉంటే కదా? అన్నారు.
ఎవరి వాదనలు ఏమిటి?
ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సీనియర్ న్యాయవాది అరుణ్‌శ్యామ్, ప్రభుత్వం తరఫున న్యాయవాది శశికిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపులా వాదనలను ఆలకించిన న్యాయమూర్తి ఏ.జీ.ఎస్ కమల్.. నవంబర్ 2న ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనానికి అనుమతి కల్పించారు. రాష్ట్రంలో వందలాది పథ సంచలనాలను నిర్వహించాము, ఎక్కడా సమస్య రాలేదు, కాబట్టి ఆదివారమే జరుపుతామన్న సంఘ్ వకీలు వాదనను ఆమోదించలేదు. నవంబర్ 2న ఆర్‌ఎస్‌ఎస్ పథసంచలనం జరుపుకోవచ్చని, శాంతిభద్రతలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని ఆదేశించారు, ర్యాలీ కోసం కొత్తగా జిల్లాధికారులకు అనుమతికి పిటిషన్ సమర్పించాలని సూచించారు. తదుపరి విచారణను జడ్జి 24వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే ఈదఫా కూడా జిల్లా యంత్రాంగం అనుమతిస్తుందా? అనే అనుమానం సంఘ్ నేతల్లో తలెత్తింది.

చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్‌కు బ్రేక్