● పారిశ్రామికవేత్తలపై
డిప్యూటీ సీఎం గుర్రు
బనశంకరి: బెంగళూరులో సౌకర్యాలను వాడుకుని కంపెనీలను ప్రారంభించి పెద్దస్థాయిలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు నేడు బెంగళూరును విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ధ్వజమెత్తారు. అనేకమంది ఐటీ, బీటీ పారిశ్రామికవేత్తలు ఇటీవల రోడ్లు, ట్రాఫిక్ సమస్యలపై వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం తెలిసిందే. ఆదివారం కోరమంగల వీరయోధ ఉద్యానవనంలో బెంగళూరు నడిగే అభియానలో డీకే.శివకుమార్ పాల్గొని ప్రజలతో మాట్లాడారు. బెంగళూరుకు వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే దానిని మరచిపోయి ట్వీట్లు చేస్తున్నారు, మనం మూలాలను మరిచిపోరాదు అని కోరారు. గుంతల రోడ్ల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో తాము చేసిన సంక్షేమం, అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ఢిల్లీ, ముంబై తో పాటు ఎక్కడికి తీసుకెళ్లినా రోడ్ల సమస్యలను చూపిస్తానని సవాల్ చేశారు. బెంగళూరు నగరంలో నిత్యం 3 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి, జనాభా 1.40 కోట్ల కు చేరుకుంది. 70 లక్షల మంది ప్రతి రోజు బయటి జిల్లాల నుంచి వచ్చి వెళుతున్నారు, ఉద్యోగం విద్య, పరిశ్రమలు, వ్యాపారం తదితర అనేక రంగాల కోసం బెంగళూరుపై ఆధారపడ్డారని తెలిపారు. బెంగళూరు పాలికెలకు నిధులను పెంచామన్నారు. టన్నెల్ రోడ్డు మార్గం, ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ వంతెనలు, బఫర్ రోడ్లు, సిటీ లైటింగ్ తదితరాల కోసం రూ.1.04 లక్షల కోట్లతో పనులు చేపడతామని చెప్పారు.
మహిళలకు కుంకుమ– పసుపు
మైసూరు: మైసూరు నగరంలోని శ్రీదుర్గా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటె ఆంజనేయ స్వామి దేవాలయం ముందు అర్చక సిబ్బందికి, పౌరకార్మికులకు, మహిళలకు పసుపు కుంకుమ, పూలను బహూకరించారు. సమాజ సేవకుడు కే.రఘురామ్ వాజపాయ్ మాట్లాడుతూ దీపావళికి నిజమైన అర్థం అంటే సంతోషాన్ని పంచడమే అన్నారు. ఒక దీపం వెయ్యి దీపాలు వెలిగేలా చేస్తుందని, ఒకరి వల్ల మిగతావారికి వెలుగు రావాలని చెప్పారు.
మరో వారం భారీ వర్షసూచన
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా మరో వారం పాటు వానలు కొనసాగే అవకాశం ఉంది. మూడు రోజుల నుంచి కరావళి, మలెనాడు, దక్షిణ ఒళనాడు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు చుట్టుపక్కల ఓ మాదిరి వానలు పడ్డాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నెల 25 వరకు వానలు పడే అవకాశం ఉంది. ముంగారు వానల కంటే హింగారు వానలు ఎక్కువ పడవచ్చని వాతావారణశాఖ అధికారులు తెలిపారు.
శివమొగ్గలో కుండపోత
శివమొగ్గ: దీపావళి పండుగ వేళలో శివమొగ్గ నగరంతో పాటు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆదివారమంతా కొనసాగింది. శివమొగ్గ నగరమంతటా వర్షం పడింది. జన జీవితానికి అంతరాయం ఏర్పడింది.
బెంగళూరు మేలును మరచి తిడతారా?
బెంగళూరు మేలును మరచి తిడతారా?