
టపాసుల వ్యాపారం.. గత వైభవం
బొమ్మనహళ్లి: ఒకప్పుడు నగరవాసులు పెద్దమొత్తంలో టపాసుల్ని కొనాలి అంటే తమిళనాడులోని హోసూరుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా బొమ్మనహళ్లి పరిధిలోని చందాపుర నుంచి మొదలుకొని, అత్తిబెలిలో తమిళనాడు సరిహద్దుల వరకు వందలాది దుకాణాలు వెలిసేవి. కానీ అదంతా గత వైభవంగా మారింది. 2023లో దీపావళి సమయంలో టపాసుల గోదాము– షాపులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 16 మంది వరకూ మరణించారు. ఆ దుర్ఘటన తరువాత ఇక్కడ దుకాణాల ఏర్పాటు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ ఒకటి తప్ప పెద్ద షాపులు లేవు. వ్యాపారం తుడిచేసినట్లు పడిపోయింది.
90 శాతం డిస్కౌంట్ అట
గిరాకీ లేకపోవడంతో 90 శాతం డిస్కౌంటు ఇస్తామని పిల్లలు అంగళ్ల ముందు ప్లకార్డులు పట్టుకుని జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి నెరళూరులో టపాసుల వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా బాణాసంచా లభిస్తోంది. అంగడి వద్దకు వచ్చి కొనేవారు తక్కువయ్యారు, అని రామస్వామి అనే వ్యాపారి తెలిపారు.
అనుమతుల భారం
● గతంలో ఘోర ప్రమాదం తరువాత టపాసుల దుకాణాలకు బెంగళూరు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు.
● పోలీసు, కాలుష్య నియంత్రణ, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ వంటి శాఖల అనుమతులు తీసుకున్నవారికే షాపులు ఏర్పాటు చేయనిచ్చారు.
● చాలామంది ఈ అనుమతులను పొందలేక, అందుకోసం పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు చేయలేక టపాసుల వ్యాపారాన్నే వదులుకున్నారు.
●అత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో 12 షాపులు, నెరళూరులో 9 అంగళ్లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఇక్కడ కనీసం 50 షాపులతో భారీగా టపాసుల వ్యాపారం జరిగేది.
●బొమ్మసంద్ర పురభ, హెబ్బగోడి నగరసభలో ఒక్క అంగడికీ అనుమతి లేదు. ఆనేకల్ తాలూకాలోని హెబ్బగోడి, బొమ్మసంద్ర, చందాపుర, తిరుమగొండనహళ్ళి గేట్, నెరళూరు, యారండహళ్ళి, అత్తిబెలి వరకు వందలాది టపాసుల షాపులతో కళకళలాడేది. ఇప్పుడు 20 కి దాటకపోవడం విశేషం.
బెంగళూరు– తమిళనాడు సరిహద్దుల్లో సవాలక్ష ఆటంకాలు
వందల నుంచి పదుల సంఖ్యకు తగ్గిన దుకాణాలు
రెండేళ్ల కిందటి దుర్ఘటనే కారణం

టపాసుల వ్యాపారం.. గత వైభవం