
మా బిడ్డను అల్లుడే చంపాడు
యశవంతపుర: బెంగళూరు మారతహళ్లి ఠాణా పరిధిలో సంచలనాత్మక డాక్టర్ కృతికారెడ్డి హత్య కేసులో ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. తాను మత్తు మందు ఇవ్వలేదని, చంపలేదని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో మృతురాలి తల్లి అల్లునిపై మండిపడ్డారు. నా కూతురిని 2024 అక్టోబర్‌లోనే హత్య చేయాలని అల్లుడు డాక్టర్ మహేంద్రరెడ్డి పథకం వేశాడని మృతురాలు డాక్టర్ కృతికారెడ్డి తల్లి, న్యాయవాది సౌజన్య ఆరోపించారు. ఆమె ఆదివారం బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడారు. పెళ్లి నాటి నుంచి మహేంద్రరెడ్డి అనుమానం రాకుండా నడుచుకున్నాడు. పెళ్లయ్యాక కృతిక అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. రోజు మార్చి రోజు నైట్ డ్యూటీ అని చెబుతూ నాకు తెలియకుండా కూతురి ప్రాణం తీశాడు అని ఆమె విలపించారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆమెకు ఇంటిలోనే వైద్యం చేస్తున్నట్లు చెప్పాడు, 22న కృతికను మా ఇంటికి తీసుకెళ్లాం. ఐవీ డ్రిప్ వేసుకొని వచ్చింది. 23న కృతిక మాతో కలిసి భోజనం చేసింది. రాత్రి 9:30 గంటలకు రూంకు వెళ్లారు. మరుసటి రోజున ఉదయం 7:30 గంటలకు అల్లుడు రూం నుంచి కేకలు వేశాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు అని సౌజన్య వివరించారు. అల్లుడు మహేంద్రరెడ్డి కృతిక కు మత్తుమందు ఇచ్చి హత్య చేశాడని ఆరోపించారు.
ఎన్నో ఆశలు పెట్టుకుంది
ఎన్నో ఆశలు పెట్టుకొని కృతికారెడ్డి నాలుగు మెడిసిన్ కోర్సులు చేసింది. డాక్టర్ చదివి సమాజ సేవ చేయాలని ఎన్నో కలలుగంది, కృతిక కు ఎలాంటి అనారోగ్యంలేదు. అల్లుడు మహేంద్రరెడ్డి మత్తు మందులిచ్చి ప్రాణాలు తీశాడు అని ఆమె చెప్పారు.
డా.కృతికారెడ్డి తల్లి సౌజన్య ఆరోపణలు