
హులిగమ్మ దేవి ఆలయంలో హుండీ లెక్కింపు
హొసపేటె: హులిగిలో వెలసిన హులిగమ్మ ఆలయంలో శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన హుండీ కానుకల లెక్కింపులో భక్తుల నుంచి దాదాపు కోటి రూపాయలకు పైగా సొమ్ము లభించింది. కళ్యాణ కర్ణాటకలో ప్రధాన శక్తిదేవత, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో హులిగమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పౌర్ణమి రోజున సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులతో నిండిపోతుంది. భక్తుల సంఖ్య పెరగడంతో కానుకల మొత్తం కూడా పెరిగింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా, అర్థరాత్రి వరకు ఆలయం హుండీ లెక్కింపు జరిగింది. 43 రోజుల వ్యవధిలో మొత్తం రూ.95.02 లక్షల నగదు, భక్తుల నుంచి 160 గ్రాముల బంగారం, 7 కిలో గ్రాముల వెండిని భక్తులు విరాళంగా ఇచ్చారు. హుండీ లెక్కింపును పోలీసు భద్రత, సీసీ టీవీ కెమెరాల నిఘాలో నిర్వహించారు. గత 50 రోజుల వ్యవధిలో రూ.కోటి 45 వేల నగదు, 80 గ్రాముల బంగారం, 8 కిలో గ్రాముల వెండి లభించాయి. భక్తుల నుంచి కానుకల రూపంలో కోట్లాది రూపాయలు వసూలవుతున్నప్పటికీ హులిగి గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, హుండీ లెక్కింపు కంటే అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపకపోవడంపై భక్తుల్లో అసంతృప్తి నెలకొంది.
దాదాపు రూ.కోటికి పైగా కానుకల సేకరణ