
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
బళ్లారిటౌన్: నేటి యువత ఉద్యోగాల కోసం వేచి చూడకుండా 10 మందికి ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలను స్థాపించే దిశగా నైపుణ్యం పెంపొందించుకోవాలని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వాణిజ్య పరిశ్రమల శాఖ, ఇండస్ట్రియల్ తదితర శాఖల ఆధ్వర్యంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభాంగణంలో ఏర్పాటు చేసిన లింక్డ్ పథకం జెడ్‌ఈడీలపై వర్క్‌షాప్‌లో పాల్గొని మాట్లాడారు. రైతులు, కళాశాల విద్యార్థులు తమ కార్యకలాపాలతో పాటు పరిశ్రమలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి చిన్నకారు పరిశ్రమల స్థాపనకు సబ్సిడీ, రుణ సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. వీటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. జిల్లా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు వీ.రామచంద్ర మాట్లాడుతూ మన దేశంలో చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటితో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ముందడుగు వేయాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జేడీ సోమశేఖర్, పారిశ్రామిక వేత్తలు జి.తిప్పయ్య, కాశియ, నింగణ్ణ, సురేష్‌బాబు, కేశవమూర్తి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.